calender_icon.png 21 December, 2024 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే బీఆర్ఎస్ సహించదు

15-10-2024 05:53:56 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గురుకుల భవనాలకు అద్దె చెల్లిస్తలేరు, కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో పిల్లలు అష్టకష్టాలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కనీసం అన్నం పెట్టలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందన్నారు. చదువు పక్కనపెట్టి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు రోడ్లపై ధర్నాలు చేసే దుస్థితికి తెలంగాణను తెచ్చారని కేటఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ ప్రైవేట్ కాలేజీలను నిరవధికంగా మూసివేయటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు చెల్లించకుండా పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని కేటీఆర్ వివర్శించారు. మూసీ కోసం రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసే కాంగ్రెస్ సర్కార్ దగ్గర అద్దె, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇవ్వటానికి పైసలు లేవా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రికి విద్యారంగంలో సమస్యలను తెలుసుకునే ఓపిక లేదని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిందిపోయి. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపించే పనిలోనే ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడని, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి సర్కార్ చెలగాటమాడుతోందన్నారు. ఢిల్లీకి మూటలు పంపించటంపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థులకు మేలు చేయటంలో లేదా?, కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించినా, సర్కారుకు చీమ కుట్టినట్లైనా లేదా? అని ప్రశ్నించారు. వెంటనే రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే బీఆర్ఎస్ సహించదని కేటీఆర్ హెచ్చరించారు.