calender_icon.png 22 November, 2024 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీని అరెస్ట్ చేయాలో.. వద్దో.. రేవంత్ చెప్పాలి

22-11-2024 03:19:57 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): అదానీ బండారం అంతర్జాతీయ స్థాయిలో బయటపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. దేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మసకబారిందని, పదేళ్ల కేసీఆర్ పాలనలో అదానీకి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇవ్వలేదని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. అదానీ కొన్ని ప్రతిపాదనలు తీసుకొస్తే తాము అంగీకరించలేదని కేటీఆర్ చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో రూ.12,400 కోట్ల ఒప్పందాలు చేసుకుందని, రాష్ట్ర విద్యుత్ సంస్థలు అదానీకి అప్పగించే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని ఆరోపించారు. స్కిల్ యూనివర్శిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం ఇవ్వడం వెనుక కుట్ర ఉందని, కాంగ్రెస్ లో హైకమాండ్ ఆజ్ఞ లేనిదే ఏం జరగదని  కేటీఆర్ విమర్శించారు. ఏడాది అయినా మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వలేదని, కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి లేనిదే అదానీతో వేల కోట్ల ఒప్పందాలు జరుగుతాయా..? ప్రశ్నించారు.

పారిశ్రామికవేత్తలు ఊరికే విరాళాలు ఇవ్వరని రాహుల్ గాంధీ చెప్పారని, అదానీ రూ.100 కోట్ల విరాళం రాహుల్ కి తెలిసే తీసుకున్నారా..?, కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో ఒప్పందాలు ఎందుకు రద్దు చేయట్లేదు..?,  ఒప్పందాలు రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రితో రాహుల్ చెబుతారా.. లేదా..? , అదానీతో దేశానికి నష్టమైతే తెలంగాణకు నష్టం కాదా..?, అయితే అదానీని అరెస్ట్ చేయాలో వద్దో.. రేవంత్ రెడ్డి చెప్పాలని అడిగారు. అదానీ విషయంతో కాంగ్రెస్, బీజేపీ వైఖరి ఒకటే అని, అదానీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాల విషయంతో బీజేపీ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదానీ లంచం ఏపీ మాజీ సీఎం జగన్ కు ఇచ్చినా.. ఎవరికి ఇచ్చినా తప్పు తప్పే అవుతోందని కేటఆర్ పేర్కొన్నారు.