హైదరాబాద్,(విజయక్రాంతి): గురుకులాల్లో మరణించిన 48 మంది విద్యార్థుల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విద్యార్థిని శైలజ 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడి సోమవారం మరణించిందని, గురుకుల పాఠశాల విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహిచాలని డిమాండ్ చేశారు.
గరుకులాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం సమీక్షించాట్లేదని మండిపడ్డారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయం, కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆ కుటుంబాల తరుపున శాసన సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. కష్టాలు వచ్చాయని పిల్లలు ఆత్మహత్యులు చేసుకోవద్దని, నిబ్బరంగా ఉండాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిలో నిస్పృహ, అసహనం కనిపిస్తున్నాయని, సీఎం పదవి వచ్చాక కూడా తమపై కోపం ఎందుకు..? అని ప్రశ్నించారు.
రేవంత్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని, అదానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పనులు ఇచ్చినట్లు పిచ్చి నివేదిక ఇచ్చారని కేటీఆర్ విమర్శించారు. జాతీయ రహదారులు పనులు ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా..? అని అడిగారు. సీఎం తప్పు మాట్లాడితే రాష్ట్ర గౌరవం తగ్గుతోందని, అదానీ చెక్ ఇచ్చి 30 రోజులైనా దాన్ని ఇంకా ఎందుకు క్యాష్ చేయలేదు..?, ఆ చెక్ పై తమకు అనుమానం వస్తోంది.. అసలు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. మేం అదానితో ఒప్పందాలు చేసుకొని ఉంటే వాటినీ రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.