న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఎంపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ఆరోపణలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందన్నారు. రాష్ట్రంలో తప్పులు జరుగుతున్నాయని ఆధారాలతో వివరాలు ఇస్తున్నామని, అమృత్ పథకంలో స్కామ్ జరుగుతుంటే కేంద్రప్రభుత్వం ఏం చేస్తోందని, ఈ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటిఎంలా మార్చిందనేది నిజమైతే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
అమృత్ పథకం పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థలకు కూడా కట్టపెట్టారని, సొంత వర్గానికి పనులు అప్పగించడం ఎంత వరకు సమంజసం అని కేటీఆర్ ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం మా ఆరోపణలను సీరియస్ గా తీసుకుంటుందని భావిస్తున్నామని, అమృత్ పథకం కుంభకోణంపై విచారణ జరిపించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి వస్తున్నారని, కానీ ఢిల్లీ నుంచి 26 పైసలు కూడా తెలంగాణకు రాలేదని ఎద్దేవా చేశారు. అల్లుడి కోసం కొడంగల్ ను బలిపెట్టే పరిస్థితి ఈ రోజు తలెత్తిందని వివర్శించారు. అస్మదీయులకు లబ్ధి చేకూర్చారని ఝార్ఖండ్ సీఎంపై కేసుపెట్టారని, అదే కేసును రేవంత్ రెడ్డి, పొంగులేటిపై ఎందుకు పెట్టట్లేదు అని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు.