హైదరాబాద్: పోరాడి సాధించుకొని.. పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామిక తెలంగాణలో.. మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు... హక్కులను అడిగితే బెదిరింపులు.. పోరాడితే సస్పెన్షన్లు అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ఇది నియంతృత్వ రాజ్యం.. ప్రభుత్వం నిర్బంధాన్ని నిర్మిస్తోందన్నారు. పోరాటం తెలంగాణకు కొత్తకాదన్న కేటీఆర్ ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నదన్నారు. ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తామని ద్వజమెత్తారు. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.