calender_icon.png 22 February, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే

22-02-2025 02:47:32 PM

హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC tunnel roof collapsed) వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS Working President KTR) ఆరోపించారు. సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్  సర్కారు వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల వేటలో పర్యవేక్షణను గాలికొదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీపడిపోవడం వల్లే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. 

పైకప్పు కూలిన ఈ ఘటనలో లోపల ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడకుండా  నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఒక బ్యారేజీలో కేవలం పిల్లర్ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఈ వరుస వైఫల్యాలపై ఇప్పుడేంమంటారు? అని ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదంలో కాంట్రాక్టర్ ను కాపాడేందుకు వాస్తవాలు దాచిపెట్టిన ప్రభుత్వం, కనీసం ఎస్ఎల్బీసీ సంఘటనపైనైనా పారదర్శకంగా దర్యాప్తు జరిపి ప్రమాదానికి గల కారణాలను బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.