10-03-2025 02:39:17 PM
హైదరాబాద్: గురుకులాల్లో మోగుతున్న విద్యార్థుల మరణమృదంగాన్ని ఆపడం చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)కి చివరికి కనీస మానవత్వం కూడా లేదని తేలిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అసమర్థ కాంగ్రెస్ సర్కారు వల్ల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని బాలికల ఆశ్రమ(Ashram Schools) పాఠశాలలో లాలిత్య అనే మరో తొమ్మిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కళ్లముందు విగతజీవిగా పడిఉన్న బిడ్డ మృతదేహం చూసి గుండెలు పగిలిన తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి, పుట్టెడు దుఖంలో ఉన్న తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకూ ప్రజల దృష్టిలో దిగజారిపోవడమే కాకుండా, కనికరం కూడా లేకుండా పోయిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూసి విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని హెచ్చరించారు.
ఈ దాష్టీకానికి విద్యాశాఖ మంత్రి(Telangana Education Minister)గా విఫలమై, హోంమంత్రిగా కూడా అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యతని సూచించారు. కేవలం 14 నెలల వ్యవధిలోనే ఒక రాష్ట్రంలోని గురుకులాల్లో 83 మంది విద్యార్థులు బలికావడం భారత దేశ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయమన్నారు. ముఖ్యమంత్రి పూర్తి అసమర్థత వల్ల జరుగుతున్న ఈ వరుస మరణాలు ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారు చేసిన హత్యలేనని తేల్చిచెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై హత్యానేరం కింద కేసులు నమోదుచేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాలిక మరణంపై తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నందున ఈ దారుణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు కనీసం మంచి భోజనం పెట్టడం కూడా చేతకాని ప్రభుత్వం చివరికి వారి ప్రాణాలను కూడా బలితీసుకోవడం సంక్షోభంలో కూరుకుపోయిన విద్యావ్యవస్థకు అద్దం పడుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అర్థాంతరంగా రాలిపోతున్న ఈ విద్యాకుసుమాల పాపం ముఖ్యమంత్రికి తగలక మానదని చెప్పారు. దయలేని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని కేటీఆర్ హెచ్చరించారు.