27-03-2025 08:57:53 AM
హైదరాబాద్: రుణమాఫీ విషయంలో నిర్మాలా సీతారామన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పందించారు. తెలంగాణ రైతుల దీనస్థితిని ఎత్తిచూపిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman)కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 30 శాతం మంది రైతులకు రుణాలు కూడా మాఫీ కాలేదని కేటీఆర్ తెలిపారు. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.. రైతుబంధు విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని తెలిపారు. దశాబ్దం తర్వాత తెలంగాణ రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. స్థానిక బీజేపీ నేతలు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడరని కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణలో రుణమాఫీపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో సగం సగం రుణమాఫీ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాజ్యసభలో నిర్మల సీతారామన్ ధ్వజమెత్తారు. తెలంగాణలో సగం మంది రైతులకు రుణమాఫీ కాకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ అయిందని చెప్పిన విషయాన్ని వెల్లడించారు. దీనివల్ల బ్యాంకులు అందరినీ పరిగణనలోకి తీసుకొని వన్ టైం సెటిల్మెంట్ కింద రుణాలను రద్దు చేస్తుందని ఆరోపించారు. ఆ తర్వాత కొత్త రుణాలు తీసుకోవడానికి రైతులకు అర్హత ఉండదని తెలిపారు. దీంతో రైతులు అటూ ఇటూ కాకుండా, తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.