హైదరాబాద్: బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ సైనికులెవరు భయపడరని చెప్పారు. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ విడుదల చేయాలని కోరారు. దళితబంధు ఆర్థికసాయం అడిగితే ఎమ్మెల్యేపై దాడి చేస్తారా..?, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడి చేయడమేనా ఇందిరమ్మ రాజ్యమంటే..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక తప్పకుండా పోలీసులకు వడ్డీతో చెల్లిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నారని విమర్శించారు. అరికెపూడి గాంధీతో కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రజల కోసం పోరాడుతున్న కౌశిక్ రెడ్డిపై సీఎం దాడి చేయించారు.. దాడులకు పాల్పడే ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.