calender_icon.png 5 October, 2024 | 6:47 PM

ఫార్మాసిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా కడతారు?

05-10-2024 03:00:30 PM

రేవంత్ రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్రదర్స్ సిటీ

రంగారెడ్డి: ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా కడతారు? అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కందుకూరు వద్ద మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నా కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. రైతుల ధర్నా వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు భారీగా చేరుకున్నారు. అర్హులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

ఒక్కో ఎకరానికి రూ. 15000 చొప్పున రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్టాడుతూ.. 2015-22 వరకు ఎంతో శ్రమించి ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి 14000 ఎకరాలు సేకరించామన్నారు. ఆ భూములు ఫార్మాసిటీకి తప్పా... ఫ్యూచర్ సిటీకి వినియోగించడానికి వీలులేదని కేటీఆర్ డిమాండ్  చేశారు. పేదల భూములు గుంజుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ పని అని ఆయన విమర్శించారు.  ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి చేసేంది ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్రదర్స్ సిటీ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో రైతులు, ప్రజలు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.