calender_icon.png 4 March, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం

04-03-2025 10:42:58 AM

హైదరాబాద్: ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Cement Corporation of India)ని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీసీఐని పునఃప్రారంభిస్తామని మాటిచ్చి, ఓట్లు, సీట్లు దండుకుని చివరికి స్క్రాప్ కింద అమ్మేస్తారా ?, సీసీఐపైనే కోటి ఆశలు పెట్టుకుని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి(Central government) కనిపించడం లేదా? వారి ఆర్థనాదాలు వినిపించడం లేదా ? అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఎంతో విలువైన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెక్కకట్టి ఆన్ లైన్ లో టెండర్లు పిలవడం, సీసీఐ సంస్థ గొంతు కోయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగంలో సిమెంట్ కున్న డిమాండ్ దృష్ట్యా సీసీఐని ప్రారంభించి కార్మికులను కాపాడాలని బీఆర్ఎస్(Bharat Rashtra Samithi ) పదుల సార్లు కేంద్రమంత్రులకు మొరపెట్టుకున్నా కనికరించకపోవడం ఆదిలాబాద్ కు వెన్నుపోటు పొడవడమేనని కేటీఆర్ ద్వజమెత్తారు. 772 ఎకరాల భూమి, 170 ఎకరాల్లో టౌన్ షిప్, 48 మిలియన్ లైమ్ స్టోన్ నిల్వలతో సకల వనరులున్న సంస్థను అంగడి సరుకుగా మార్చేసిన కేంద్రానికి ఉద్యోగులు, కార్మికుల గోస తగలక మానదని చురకలంటించారు. ఈ అనాలోచిత నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే దాకా కార్మికులతో కలిసి ఉద్యమిస్తాం.. సంస్థ పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) స్పష్టం చేశారు.