calender_icon.png 23 December, 2024 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు బతుకును మార్చిన గేమ్ ఛేంజర్ 'రైతుబంధు'

21-12-2024 11:53:41 AM

  • అసెంబ్లీ సమావేశాలు పది రోజులు పెంచాలి: కేటీఆర్
  • బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తాం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రైతు భరోసా విధి విధానాలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ పై చేసిన ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ... మంత్రి కోరినట్లు ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మిషన్ భగీరథపై చర్చ చేపట్టాలని కేటీఆర్ కోరారు. నల్గొండ జిల్లా అభివృద్ధిపై కూడా ఒక రోజు చర్చ చేపట్టాలని కేటీఆర్ కోరారు. గతంలో జరిగిన తప్పులు ఎత్తిచూపితే మీకు ఇబ్బందిగా ఉందన్న కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలు పది రోజులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టడం సబబా? అని ప్రశ్నించారు. గతంలో 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలన సగటున 19.2 గంటల విద్యుత్ ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తవించారు.

కాంగ్రెస్ పాలనలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారని విమర్శించారు. సభ వాయిదా వేసి నల్గొండ జిల్లాకు వెళ్లి విద్యుత్ పరిస్థితులు పరిశీలిద్దామని కేటీఆర్ కోరారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చూపెడితే బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తామని కేటీఆర్ సవాల్ చేశారు. దేశంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఉమ్మడి పది జిల్లాలో ధాన్యం పండించడంలో నల్గొండ జిల్లా నంబర్ వన్ అన్నారు. రైతుబంధు మీద కాంగ్రెస్ విపరీతమైన దుష్ప్రచారం చేసిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతు బతుకును మార్చిన గేమ్ ఛేంజర్ రైతుబంధు అని కేటీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా? లేదా అని గతంలో తమ మెడపై కత్తి పెట్టారు..మెడపై కత్తి పెట్టినా మోటర్లకు మీటర్లుపెట్టబోమని చెప్పామని ఆయన గుర్తుచేశారు. రూ. 30 వేల కోట్ల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో 14 లక్షల మంది రైతులు వలస వెళ్లేవారు.. మహబూబ్ నగర్ వలసలపై తాను చెప్పింది అబద్ధమనుకుంటే రేవంత్ రెడ్డిని అడగండన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఉదయం 3 గంటలు, సాయంత్రం 4 గంటలే విద్యుత్ సరఫరా ఉండేదని కేటీఆర్ గుర్తుచేశారు.