ఏసీబీ కేసును కొట్టేయాలన్న పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు
- కోర్టు మినీ ట్రయిల్ చేయబోదు
- కోర్టులు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయవు
- ప్రాథమిక ఆధారాలపై దర్యాప్తు జరగాల్సిందే: హైకోర్టు
- అరెస్ట్‌పై స్టే ఇచ్చేందుకూ నిరాకరణ
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): ఫార్ములా ఈ-కార్ రేసు అక్ర మాల కేసులో నిందితుడైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుకు హైకోర్టు లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం డిస్మిస్ చేసింది.
ఫార్ములా ఈ కేసు దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వుల జారీ చేయాలన్న కేటీఆర్ అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. పిటిషన్ డిస్మిస్ నేపథ్యంలో కనీసం పది రోజులపాటు కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలన్న చిట్టచివరి ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇలాంటి కేసుల్లో తీర్పుపై అప్పీల్‌కు వీలుగా నిందితులను పది రోజులపాటు అరెస్టు చేయ కుండా ఉత్తర్వుల జారీచేయబోమని తేల్చి చెప్పింది.
కేటీఆర్ పిటిషన్‌ను కొట్టివేస్తూ మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ కీలక తీర్పును వెలువరించారు. పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు ఏక వాక్య తీర్పును వెలువరించగానే కేటీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు జోక్యం చేసుకుని, తీర్పు అప్పీల్ దాఖలు చేస్తామని, పది రోజులపాటు కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ఇందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తును అడ్డుకోబోమని స్పష్టం చేశారు. దీంతో ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ నమోదు చేసిన కేసులో పోలీసుల దర్యాప్తునకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
గత నెల 2౦న ఎఫ్‌ఐఆర్
ఫార్ములా ఈ-కార్ రేసును హైదరాబాద్‌లో నిర్వహించే నిమిత్తం హెచ్‌ఎండీయే ఒప్పందం చేసుకోవడం వెనుక నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లిందంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అప్పటికే ఈ వ్యవహారంలో కేటీఆర్‌పై దర్యాప్తునకు గవర్నర్ నుంచి ప్రభుత్వం అనుమతి పొందింది.
దానకిశోర్ ఫిర్యాదు మేరకు గత నెల 20న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీనిని కొట్టేయాలంటూ అదే రోజు దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. క్వాష్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనల తర్వాత గత నెల 31న తీర్పును రిజర్వు చేసింది.
మంగళవారం 35 పేజీల తీర్పును న్యాయమూర్తి వెలువరించడంతో కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు మార్గం సుగమం అయ్యింది. తీర్పు వెలువడే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని, అయితే, కేటీఆర్ ఏసీబీ దర్యాప్తునకు సహకరించాలంటూ గతంలోని మధ్యంతర ఉత్తర్వులను పది రోజులపాటు కొనసాగించాలన్న కేటీఆర్ న్యాయవాది తాజాగా మంగళవారం చేసిన అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది.
దీంతో కేటీఆర్ ఏసీబీ దర్యాప్తును ఎదుర్కొనడం లేదంటే సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసి ఉత్తర్వులు పొందడం తప్ప అన్ని మార్గాలన్నీ మూసుకుపోయినట్టు అయ్యింది.
కోర్టు మినీ ట్రయిల్ చేయబోదు
‘కేసు విచారణ ప్రాథమిక దశలో ఉండగా కోర్టులు మినీ ట్రయిల్ నిర్వహించేందుకు లేదు. కేసులో పిటిషనర్‌పై వచ్చిన ఆరోపణలు, అధికారాల దుర్వినియోగం, వ్యాపార నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, హెచ్‌ఎండీయే డబ్బును దుర్వినియోగం చేయడం, రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించడం, థర్డ్ పార్టీకి లబ్ధి చేకూర్చడం వంటివి ఉన్నాయి.
పిటిషనర్‌పై ఐపీసీ సెక్షన్ 409, అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(1)(ఎ), 13(2) వంటివి నమోదయ్యాయి. ఈ నేరాభియోగాలను రద్దు చేయడానికి అర్హమైనవో కాదో కోర్టులు తేల్చడానికి పరిధి తక్కువ. బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 528 (ఇది పూర్వపు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 482) ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసే అధికారం పరిమితం.
అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే కోర్టుల జోక్యానికి వీలుంది. కేసు విచారణ ప్రక్రియ దుర్వినియోగం అవుతున్నప్పుడు, చట్ట దుర్వినియోగానికి దారితీసే సందర్భాల్లో మాత్రమే అరుదుగా మాత్రమే కోర్టుల జోక్యానికి వీలుంది. దర్యాప్తు అధికారాలను కోర్టులు తమ చేతుల్లోకి తీసుకోబోవు.
దర్యాప్తును హైకోర్టు అణచివేయదు. సెక్షన్ 528 కింద తన స్వాభావిక అధికారాన్ని వినియోగించి ఆరోపణలపై విచారణ చేపట్టబోదు. కోర్టే విచారణ బాధ్యతను చేపట్టబోదు. కోర్టు మినీ ట్రయిల్ నిర్వహించజాలదు’ అని తీర్పులో పేర్కొంది.
దర్యాప్తులో తేలాల్సిఉంది
ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడానికి అర్హమైనదా? కాదా? అనే అంశంలోకి వెళ్లే ముందు పిటిషనర్‌పై ఉన్న అభియోగాలపై దర్యాప్తు జరగాల్సివుందని హైకోర్టు పేర్కొంది. పీసీ యాక్ట్లోని 13వ సెక్షన్ కింద పిటిషనర్ నేరపూరిత దుష్ప్రవర్తనతో వ్యవహించారా? లేదా? ఆ నేరపూరిత దుష్ప్రవర్తన అంశాలు మోసపూరితమా కాదా? పిటిషనర్ నిజాయితీపరుడా? నిజాయితీగా ఉన్నారా? లేదా? హెచ్‌ఎండీయేకి సంబంధించిన ప్రజల ఆస్తిని సొంతానికి మళ్లించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరిగాయా? లేదా? వంటి విషయాలన్నీ దర్యాప్తులో తేలాల్సి ఉందని స్పష్టంచేసింది.
లలితకుమారి, చరణ్‌సింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు జారీచేసిన తీర్పులకు విరుద్ధంగా కేసు నమోదు 14 నెలలపాటు తీవ్ర జాప్యమైందని, ఆ కేసుల్లో సుప్రీం కోర్టు మూడు నెలల జాప్యానికే ఒప్పకోలేదని, ఇక్కడ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(ఎ) కింద కేసు నమోదు చెల్లదని పిటిషనర్ చేసిన వాదన ఈ కేసులో వర్తించదని చెప్పింది. ఏసీబీ కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే ఎఫ్‌ఐఆర్ కొట్టేయాలని కోరడం చట్ట వ్యతిరేకమని, దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది.
విదేశీ కంపెనీలకు నేరుగా సొమ్ము చెల్లింపు
‘విదేశీ కంపెనీలకు భారీ మొత్తంలో ప్రజాధనాన్ని చెల్లించాలని హెచ్‌ఎండీయేను పిటిషనర్ ఆదేశించారనే అభియోగం ఉంది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఆమోదం పొందకుండానే సొమ్ము చెల్లించాలనే ఆదేశాలు వెలువడ్డాయి. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే నిధులు విడుదలయ్యాయి.
పిటిషనర్ తనకు లేదా థర్డ్ పార్టీకి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో చెల్లింపులకు ఆదేశించారా? లేదా? అన్నది దర్యాప్తులో తేలాల్సివుంది. నిధుల దుర్వినియోగం, తప్పు జరిగిందనే కేసు నమోదైన 24 గంటల్లోనే పిటిషనర్ హైకోర్టుకు వచ్చారు. కేసు దర్యాప్తు ప్రారంభం కాకుండానే కోర్టుకు వచ్చి ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరడం సబబుకాదు.
ప్రాథమిక దశలోనే ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరడానికి వీల్లేదు. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్ 18న ఫిర్యాదు అందితే, ఆ తర్వాత రోజు 19న ఎఫ్‌ఐఆర్ నమోదైందని, ఆ మరుసటి రోజునే 20న పిటిషనర్ హైకోర్టుకు వచ్చేశారని ఆక్షేపించింది. క్రిమినల్ కేసు దర్యాప్తునకు దర్యాప్తు సంస్థ సాక్ష్యాలను సేకరించేందుకు సహేతుకమైన అవకాశం, సమయం ఉండాలి. ఈ దశలో తొందరపాటుతో దర్యాప్తును అడ్డుకోబోమని స్పష్టంచేసింది
ఒప్పందానికి ముందే చెల్లింపులు: ఏజీ సుదర్శన్‌రెడ్డి
ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి 2023లో రెండో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందే చెల్లింపులు జరిగాయని ఏజీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఒప్పందాలు జరుగుతాయని ముందుగానే ఊహించి చెల్లింపులు చేశారని, ఇది అవినీతి కిందకే వస్తుందని చెప్పారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని, ఫస్ట్ అగ్రిమెంట్ 2022 అక్టోబరు 15న జరగ్గా.. 2023 అక్టోబరు 27న రద్దయిందని అన్నారు.
ఆ తర్వాత 2023 అక్టోబర్ 30న రెండో ఒప్పందం జరిగిందని, రెండో ఒప్పందానికి ముందే.. అంటే 2023 అక్టోబర్ 3, 11 తేదీల్లో రెండు విడతలుగా రూ.54.88 కోట్లు హెచ్‌ఎండీయే సాధారణ నిధుల నుంచి చెల్లింపులు చేసేసిందన్నారు. నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆధీనంలోనే హెచ్‌ఎండీయే ఉందని, మున్సిపల్ మంత్రిగా పిటిషనర్ కేటీఆర్ ఉన్నారని చెప్పారు.
పిటిషనర్ చెప్పిన కారణంగానే ఆర్థిక శాఖ అనుమతి కూడా లేకుండా నగదు చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. చట్ట ప్రకారం రూ.10 కోట్లకు మించి చెల్లింపులు జరపాలంటే ప్రభుత్వం నుంచి హెచ్‌ఎండీయే అనుమతి పొందాలన్న నిబంధనను కూడా అమలు చేయలేదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత మొత్తం చెల్లించాలంటే ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందాలని, ఈ నిబంధనను గాలికి వదిలేసి చెల్లింపులు చేసేలా పిటిషనర్ మంత్రి హోదాలో అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. పది కోట్లకు మించి విదేశీ సంస్థలకు నిధులు పంపాలంటే రిజర్వు బ్యాంకు అనుమతి పొందాలన్న నిబంధనను గాలికి వదిలేశారని, ఐవోబీ ద్వారా నేరుగా విదేశీ సంస్థలకు సొమ్ము చెల్లింపులు కూడా చట్టవ్యతిరేకమని తెలిపారు.
విదేశీ సంస్థకు నగదు చెల్లించిన ఫలితంగా ఇన్కం ట్యాక్స్ కింద రూ.14 కోట్లు అదనపు భారం పడిందని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ వల్ల స్పాన్సరర్‌కే లాభాలు వచ్చాయని చెప్పారు. నిందితుల జాబితాలో ఫార్ములా ఈ సంస్థను ఎందుకు చేర్చలేదని పిటిషనర్ ప్రశ్నించడం ద్వారా కేసు నుంచి ఏదోఒక విధంగా తప్పించుకునే తాపత్రయమేనని అన్నారు.
దర్యాప్తులో తేలే అంశాల ఆధారంగా అవసరమైతే ఇతరులను కూడా నిందితులుగా చేర్చేందుకు చట్టంలో వెసులుబాటు ఉందన్నారు. ఫార్ములా ఈ రేస్కు చెందిన కంపెనీ ఇంగ్లండ్‌కు చెందినదని, అన్ని అంశాలను పరిశీలించాకే కేసు నమోదు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని స్పష్టంచేశారు. అందుకే ఎఫ్‌ఐఆర్ నమోదుకు కొంత జాప్యం జరిగిందని పేర్కొన్నారు.
రాజకీయ, వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలతో కేసు నమోదు చేశామని పిటిషనర్ వాదించడమే రాజకీయమని చెప్పారు. ‘రెండో ఒప్పందం చేసుకోడానికి ముందే రెండు విడతల్లో నగదు చెల్లింపులు జరిగాయి. విదేశీ కరెన్సీ చెల్లింపుల నిబంధనలను ఉల్లంఘన జరిగింది. చట్టాలను గుంపగుత్తగా ఉల్లంఘన చేశారు.
నిధులు ఎవరికి చెల్లించారో, చెల్లించామన్న చెప్తున్న నిధులు ఆ సంస్థకు వెళ్లాయో లేదో? ఒకవేళ నిధులు ఆ సంస్థకు వెళితే అక్కడి నుంచి ఆ నగదు వేరే వాళ్లకు మళ్లింపు జరిగిందా? అవినీతి ఎక్కడ జరిగింది? పిటిషనర్‌కే తిరిగి నిధులు చేరాయా? వంటి అంశాలన్నీ ఏసీబీ దర్యాప్తులో తేలుతాయి.
ఈ దశలో పిటిషనర్ వాదనలను ఆమోదించొద్దు అని ఫిర్యాదుదారుడైన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు.
కేటీఆర్ పిటిషన్ డిస్మిస్
‘ఫార్ములా రేస్ నిమిత్తం ప్రభుత్వం, ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈఓ), ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. సీజన్ 9 సమర్థంగా నిర్వహించాక 10వ సీజన్‌కు ప్రమోటర్ వెళ్లిపోవడంతో ప్రభుత్వమే చెల్లింపులు జరిపి రేస్ నిర్వహణకు అగ్రిమెంట్ కుదిర్చింది. ఇప్పటికే ఉన్న ఒప్పందం అమల్లో భాగంగానే రెండో అగ్రిమెంట్ జరిగింది.
అది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జరిగిందని అభియోగం. 2023కు చెందిన బకాయిలకు చెల్లింపులు కూడా జరిగాయి. కొత్త ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ఈ వివాదం అంతర్జాతీయ స్థాయిలో అర్బిట్రేషన్ పరిధిలోకి వెళుతుందని నాటి పాలకులు భావించారు. కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి..
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా కేసు నమోదు అయ్యిందని పేర్కొన్నారు. నిధుల చెల్లింపులు, అంతకుముందు అగ్రిమెంట్లు అన్నీ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని, నిధులు పొందిన వాళ్లను వదిలేసి పైసా కూడా తీసుకోని తనను నిందితుడిగా చేర్చడం రాజకీయ కుట్రేలో భాగమేనని చెప్పారు.
నిధులను తన సొంతానికి వినియోగించుకోలేదని, ప్రమోటర్ నిందితుడిగా లేనప్పుడు ఐపీసీ 120 బి కింద కుట్ర జరిగిందనే అభియోగాన్ని ఎలా మోపుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ విధాన నిర్ణయంలో భాగంగానే ఇవన్నీ జరిగాయని,. విధాన నిర్ణయాల్లో లోటుపాట్లు ఉంటే వాటిని ప్రభుత్వమే సరిదిద్దుకోవాలని, ఆ నాటి మంత్రి తీసుకున్న నిర్ణయమని చెప్పి తనపై కేసు నమోదు చట్ట వ్యతిరేకమని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్’ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
ప్రాథమిక ఆధారాలపై దర్యాప్తు జరగాల్సిందే
‘బ్యాంకర్లు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్‌కు పాల్పడ్డారనే కోణంలో ఐపీసీ సెక్షన్ 409 కింద ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలున్నందున ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు జరగాల్సిందే. కేసు దర్యాప్తును అడ్డుకునే పరిధి కోర్టులకు తక్కువ. భజన్‌లాల్, నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీం ఉత్తర్వులు ఇక్కడి కేసుకు వర్తించవు. కే
సు నమోదు 14 నెలలు ఆలస్యంగా నమోదయ్యిందని చెప్పి ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరడానికి వీల్లేదు. మంత్రిగా చేసిన వాళ్లపై కేసు నమోదుకు వీల్లేదన్న పిటిషనర్ వాదన ఆమోదయోగ్యంగా లేదు. ఆ కేసులో సుప్రీం తీర్పు ఈ కేసులోని అభియోగాలకు వర్తించదు.
ఇక్కడ నిధులను దుర్వినియోగానికి హెచ్‌ఎండీయేకి చెందిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా ఉంది. ఆ ఒప్పందం జరిగినప్పుడు మున్సిపల్ మంత్రిగా పిటిషనర్ ఉన్నారు. ఆ మంత్రిత్వ శాఖ ఆధీనంలోనే హెచ్‌ఎండీయే ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించిన నోట్‌ను మంత్రి హోదాలో పిటిషనర్ ఆమోదించారు.
ఇక్కడి కేసులో అభియోగాలు సాధారణ వ్యక్తులపై కాదు. నేరపూరిత విశ్వాస ఉల్లంఘనల అభియోగాలు హెచ్‌ఎండీయే అధికారిపై ఉన్నాయి. పిటిషనర్ మరొకరితో కలిసి కుట్రతో దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణ కూడా ఉంది. నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలపై దర్యాప్తును అడ్డుకోవాలని కోరడానికి వీల్లేదు’ అని హైకోర్టు తేల్చి చెప్పింది.
కోర్టులు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయవు
‘ కేసును లోతుగా పరిశీలించిన తర్వాత పిటిషనర్‌పై ఐపీసీ 409, పీసీ యాక్ట్లోని 13(1)(ఎ) కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలన్న పిటిషనర్ అభ్యర్థన ఆమోదయోగ్యం కాదనే నిర్ణయానికి వచ్చింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయబోమని తేల్చిచెప్పింది. ఎఫ్‌ఐఆర్‌లో అభియోగం ప్రాథమి కంగా ఉంది. ఈ దశలో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు జరగాల్సిందే.
ఎఫ్‌ఐఆర్‌లో ఏదైనా నిర్దిష్ట నేరాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని, ప్రాథ మిక నేరారోపణపై దర్యాప్తు జరగాలని చెప్పింది. ఆ ఆరోపణలపై సంతృప్తి చెందకపోయినా ఈ కోర్టు సదరు ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయబోదని స్పష్టంచేసింది. బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 528 ప్రకారం నమోదైన కేసులో నేరారోపణలు బహిర్గతం కావాలంటే దర్యాప్తు కొనసాగాలని సోమ్జిత్ మల్లిక్ వర్సె స్ జార్ఖండ్ రాష్ట్రాల మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శాకలను జారీ చేసిందని’ హైకోర్టు తీర్పులో పేర్కొంది.
అన్నీ దర్యాప్తులో తేలాల్సివుంది..
‘ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణ ఎవరి ప్రయోజనాల కోసం నిర్వహించారు. హైదరాబాద్ సిటీ కోసమా, మరొక వ్యక్తి కోసమా? ఈ రేస్ పేరుతో చెల్లింపులు చేసినట్టు చెప్తున్న సొమ్ము తరలింపు ఎక్కడికి చేరిందో తేల్చాల్సి ఉంది. ఏసీబీ కేసులోని అభియోగాల్లో నిజం ఎంతుంది? ఇవన్నీ ఏసీబీ దర్యాప్తులో తేలాల్సివుంది. రూ.54.88 కోట్లు ప్రభుత్వ నిధులు తరలి వెళ్లింది వాస్తవమే.
రూల్స్ ఉల్లంఘించి చెల్లింపులు జరిగాయా? లేదా? సీజన్ 9 నిర్వహించిన స్పాన్సర్స్ సీజన్ 10 నిర్వహించే ముందుకు ఎందుకు తప్పుకున్నారు? అప్పటికప్పుడు ఆ బాధ్యతలను హెచ్‌ఎండీయే ఎందుకు తీసుకుంది. నాడు మున్సిపల్‌శాఖ మంత్రిగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయం కారణంగానే ఇవన్నీ జరిగాయా? లేదా? ఇవన్నీ కేసు దర్యాప్తులో తేలాల్సివుంది. కాబట్టి ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలన్న కేటీఆర్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నామని హైకోర్టు తీర్పులో పేర్కొంది.
కేటీఆర్‌పై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి: హైకోర్టు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తన తీర్పులో భాగంగా.. ‘ఫిర్యాదు చేసింది సాధారణ వ్యక్తి కాదు. బాధ్యతగల అధికారి. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి. కేటీఆర్ ఇతర నిందితులతో కలిసి కుట్ర చేసి హెచ్‌ఎండీఏ డబ్బును దుర్వినియోగం చేశారన్నది అభియో గం. ఎఫ్‌ఐఆర్‌లో అన్నింటికీ ఆధారాలు అవసరంలేదు. ఏ ఒక్కటి ఉన్నా దాని ఆధారంగా తీగ లాగితే డొంక కదలొచ్చు.
కేసును పరిశీలిస్తే కేటీఆర్‌కు వ్యతిరేకంగా ప్రాథ మిక ఆధారాలు ఉన్నా యి. కాబట్టి దురుద్దే శం, దుర్వినియో గం, ఇతరులను అరెస్టు చేయకపోవడం, ఇతరులను నిందితులుగా చేర్చకపోవడం వంటివి ఏసీబీ దర్యాప్తులోని అంశాలు అవుతాయి. క్యాబినెట్ లేదా ఆర్థికశాఖ ఆమోదం లేకుండా హెచ్‌ఎండీఏ నిధుల్ని విదేశీ కంపెనీకి చెల్లింపులకు కేటీఆర్ ఆదేశించినట్టు ఆధారాలున్నాయి.
స్వలాభం కోసమా లేక ఇతరకు లబ్ధి చేకూర్చేందుకు ఆవిధంగా చేశారో? లేదో? దర్యాప్తులో తేలాలి. కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, సచివాలయ బిజినెస్ రూల్సుకు విరుద్ధంగా వ్యవహరించారని, హెచ్‌ఎండీఏ ధనాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడంతోపాటు ఇతరులకు లబ్ధి చేకూర్చానే ఆరోపణలు స్పష్టంగా ఉన్నాయి.
కాబట్టి ఐపీసీ సెక్షన్ 409 తోపాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఎ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు సబబే. ప్రభుత్వ ఆస్తి తన పరిధిలో లేదన్న కేటీఆర్ వాదనను ఈ దశలో ఆమోదించలేం. కేటీఆర్ ఆదేశాల వల్లే నిధుల బదిలీ అయినట్లుగా ప్రాథమికంగా వెల్లడైంది. కాబట్టి కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.