ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపడుతున్న ప్రజాపాలనను ఓర్వలేకనే కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు అధికారం పోవడంతో కేటీఆర్‌కు మైండ్ పోయిందని, అందుకే సైకోగా మారడని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు.
స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళం వెనక్కి ఇస్తున్నట్టు సీఎం ప్రకటించిన తర్వాత కూడా కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. వివాదాలకు దూరంగా ఉండాలనే అదానీ నుంచి విరాళం తీసుకోవడం లేదని చెప్పారు. స్కిల్ వర్సిటీకి నిధులు రాకుండా చేయాలని కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ పరిస్థితి బీజేపీతో ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్టు ఉందన్నారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్ణయం మేరకు తామందరం నడుచుకుంటామన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన చేస్తున్నామని చెప్పారు.