- ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం
- ప్రక్షాళనకు నల్లగొండ వాసులు ఉద్యమించాలి
- మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మూసీ ప్రక్షాళనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అతి తెలివి ప్రదర్శిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం మూసీని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్‌ను సైతం ఏర్పాటు చేసి రూ. 16, 553 కోట్లతో ప్రణాళిక సైతం రూపొందించిందని గుర్తు చేశారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. మూసీ కలుషిత కారణంగా యాదాద్రి, నల్లగొండ జిల్లాల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్ తెలివైన వాడేనని, కానీ మూసీ ప్రక్షాళన నిర్ణయంపై ఆయన వ్యవహార శైలి సరికాదన్నారు. మూసీ ప్రక్షాళన వాజ్‌పేయ్ హయాంలోనే ప్రారంభం అయిందన్నారు. మూసీని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదేనని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
నల్లగొండ ప్రజలు మూసీ ప్రక్షాళనకు ఉద్యమించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నోరు తెరిస్తే లోపలికి దోమలే పోతాయని పేర్కొన్నారు. ‘మీరు చేస్తే సుందరీకరణ, అవతలోడు చేస్తే దోచుకోవడమా’ అని కేటీఆర్‌పై మండిపడ్డారు.
ఎంపీ ఈటల రాజేందర్ గతాన్ని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలకు మంచి చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.