calender_icon.png 26 October, 2024 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ గోబెల్స్ ప్రచారం

29-07-2024 02:27:54 AM

మేడిగడ్డ కుంగింది రీ-డిజైనింగ్, రీ- ఇంజినీరింగ్ వల్లే

  1. కుంగినప్పుడు అధికారంలో ఉన్నది మీరే 
  2. మేడిగడ్డ గుండెకాయ అంటూ ప్రగల్భాలు పలికింది మీరే కదా!

మాజీ మంత్రి కేటీఆర్‌పై నిప్పులుచెరిగిన మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): మేడిగడ్డ కుంగింది ముమ్మాటికీ రీ-డిజైనింగ్, రీ- ఇంజినీరింగ్ వల్లేనని రాష్ర్ట నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. అంతటి నిర్వాకం జరిగింది మాజీ సీఎం కేసీఆర్  వల్లేనని విమర్శించారు. కేసీఆర్ స్వయంగా డిజైన్ చేసింది అంటూ గులాబీ దండు ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. మేడిగడ్డకు ఎందుకు నీళ్లు పంపింగ్ చెయ్యడం లేదంటూ మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడిన అంశంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

కట్టినప్పుడు, కూలినప్పుడు అధికారంలో ఉన్నది వారే అయినప్పుడు ఆ నెపం మరొకరి మీదకు నెట్టడం వారి విజ్ఞతకే వదిలి పెడుతున్నట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. ఆదివారం జలసౌధలో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బరాజ్ కూలిన 47 రోజలకు తాము అధికారంలోకి వచ్చిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. మరి ఆ 47 రోజులు అధికారంలో ఉన్న మీరు ఏంచేశారని ప్రశ్నించారు. నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన ఘనత పదేళ్ళు అధికారం వెలగబెట్టిన బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన విమర్శించారు. వాస్తవాలను వక్రీకరించడం కేసీఆర్, కేటీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన దుయ్యబట్టారు. అందులో భాగమే కేటీఆర్ వ్యాఖ్యలు అని ఉత్తమ్ విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా గోబెల్ ప్రచారం ఆపాలని కేటీఆర్‌కు ఆయన హితవుపలికారు.

ప్రగల్భాలు పలికింది మీరే కదా...

కాళేశ్వరంకు మేడిగడ్డ గుండెకాయ అని ప్రగల్భాలు పలికింది మీరే అని అటువంటి మేడిగడ్డ కుంగినప్పుడు తీసుకున్న చర్యలు ఏమిటో స్పష్టం చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రూ. 94 వేల కోట్లు ప్రజాధనాన్ని వినియోగించి 93 వేల ఎకరాలను కుడా సాగులోకి తీసుకరాక పోవడమే మీరు చెప్పిన రీ- డిజైనింగ్, రీ -ఇంజినీరింగ్ గొప్పతనమా అని ప్రశ్నిం చారు. బరాజ్‌ల నిర్మాణం సమయంలో సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) అనుమతి ఎందుకు తీసుకోలేదో కేటీఆర్ వివరించాలన్నారు. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ (ఎన్డీఎస్‌ఏ) నిపుణులు సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ  గేట్లు తెరిచినట్లు వివరించారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన ఎన్డీఎస్‌ఏను అవమానకరంగా మాట్లాడం కేటీఆర్‌కే చెల్లిందన్నారు.

పూర్ డిజైనింగ్, పూర్ కనస్ట్రక్షన్, పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అంటూ ఎన్డీఎస్‌ఏ కాళేశ్వరంపై నివేదిక ఇచ్చిందని అప్పుడు అధికారంలో ఉన్నది మీరేనంటూ కేటీఆర్‌ను ఉత్తమ్ నిలదీశారు. మేడిగడ్డకు నీళ్లు పంపింగ్ చేస్తే ప్రమాదం తలెత్తే అవకాశం ఉందన్నారు. జరగబోయే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అంతా ఇంతా అని చెప్పలేమన్నారు. ఎన్డీఎస్‌ఏ సూచనలను కాదని రీ-డిజైనింగ్, రీ- ఇంజినీరింగ్ సృష్టికర్తలు చెప్పినట్లు చేస్తే ఇప్పటికే పూర్తి అయిన సమ్మక్క-సారక్క ప్రాజెక్టు కొట్టుకు పోవడంతో పాటు సీతారాం ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుందన్నారు. భద్రాచలంతో పాటు 44 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. ఈ ప్రభుత్వానికి ఎటువంటి దురాలోచాన లేదని ఉన్నదల్లా దూరాలోచనేనన్నారు. కేటీఆర్ దురుద్దేశంతోనే పంపింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం అవుతుందని ఆయన ఆరోపించారు. 

ఆ మూడింటిని వినియోగంలోకి తేవాలన్నదే మా లక్ష్యం...

మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారంలను ఏ విధంగా వినియోగంలోకి తేవాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ ఆలోచన అని ఉత్తమ్ తెలిపారు. ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజల సొత్తుగా ఆయన అభివర్ణించారు. ఈ ప్రాజెక్టును ఎలాగైనా కాపాడాలనేదే తమ లక్ష్యమన్నారు. పూర్తిస్థాయిలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే అసలు, వడ్డీ కలిపి చెల్లించాల్సింది రూ. 25 వేల కోట్లు కాగా, ఇప్పటికే రూ.15,000 కోట్లు చెల్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుడా ఇంతటి అధిక వడ్డీలకు అప్పులు చేసిన సందర్భం లేదన్నారు. నాన్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌ల నుండి అధిక వడ్డీలతో అప్పులు తెచ్చి రాష్ర్ట ప్రజలపై పెను భారం మోపిన చరిత్ర బీఆర్‌ఎస్ నాయకులదన్నారు.

బీఆర్‌ఎస్ నాయకుల మాదిరిగా అబద్దాలు ఆడడం, అబద్ధాన్ని నిజంగా నమ్మించడం తమకు చేతకాదని ఆయన కేటీఆర్‌ను ఎత్తిపొడిచారు. అటువంటి అబద్ధాల తోటే కదా రూ.38,000 కోట్లతో పూర్తి అయ్యే ప్రాణహితే చేవెళ్ల-ను రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. అదే పూర్తి అయి ఉంటే ఇప్పటికే 16.4 లక్షల ఎకరాల నుండి 18.25 లక్షల ఎకరాల వరకు సాగులోకి వచ్చి ఉండేదన్నారు విద్యుత్ బిల్లుల కోసం పంపింగ్ నిలుపుదల అంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలను ఆయన తిప్పి కొట్టారు.

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రూ. 10 వేల కోట్ల విద్యుత్ బిల్లులు అదనపు భారంగా పరిణమించాయన్నారు. -ప్రాణహిత చేవెళ్ల పూర్తి అయి ఉంటే కేవలం రూ. 1,000 కోట్ల విద్యుత్ ఖర్చుతో బయటపడేవారం కదా అని ఆయన పేర్కొన్నారు. తుమ్మడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం వద్దు అని సీడబ్ల్యూసీ చెప్పినట్లు బీఆర్‌ఎస్ చేస్తున్న వాదనలో నిజంలేదన్నారు. మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని, దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టంచేశారు.

* మేడిగడ్డ బరాజ్ కూలిన తర్వాత 47 రోజులు అధికారంలో ఉన్నది మీరే. మరి మీరు ఏంచేశారు? నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. వాస్తవాలను వక్రీకరించడం కేసీఆర్, కేటీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగమే కేటీఆర్ వ్యాఖ్యలు. ఇప్పటికైనా గోబెల్ ప్రచారం ఆపాలి.

 ఉత్తమ్‌కుమార్‌రెడ్డి