calender_icon.png 16 October, 2024 | 4:56 PM

కేటీఆర్.. మీ నాన్నకు వ్యతిరేకంగా పోరాటం చెయ్

16-10-2024 03:23:57 AM

  1. మీరు అధికారంలో ఉన్నప్పుడే నేవీ రాడార్ జీవో 
  2. కేసీఆర్  కుటుంబానిది రెండు నాల్కల ధోరణి
  3. దేశభద్రత అంశంపై ఇంత బాధ్యతారాహిత్యమా 
  4. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్టు విషయంలో ఆందోళన చేస్తానని ప్రకటించిన కేటీఆర్.. ముందు తన తండ్రికి వ్యతిరేకంగా పోరాడాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి సూచించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే దామగుండం నేవీ రాడార్‌కు భూమిని కేటాయిస్తూ జీవో ఇచ్చారని గుర్తుచేశారు.

నేవీ రాడార్ అంశంలో బీఆర్‌ఎస్, కేసీఆర్ కుటుంబం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2017లోనే నేవీ రాడార్ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలోనే అనుమతులు అన్నీ ఇచ్చీ.. ఇప్పుడు వ్యతిరేకించడం వారి రెండు నాల్కల ధోరణిని చాటుతోందని దుయ్యబట్టారు.

దేశ భద్రత, రక్షణ విషయంలో బీఆర్‌ఎస్ మొదటి నుంచీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ సీఎం కేసీఆర్ గతంలో చైనా సైనికులతో ఘర్షణలో భారత సైనికులు పారిపోయి వచ్చారంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. పాకిస్తాన్ పై భారత్ సర్జికల్ స్ట్రుక్స్‌పై ఆధారాలు, సాక్ష్యాలు ఏవి అంటూ బీఆర్‌ఎస్ నాయకులు బాధ్యతారాహితంగా మాట్లాడారని గుర్తుచేశారు.

దేశ రక్షణకు సంబంధించిన అంశంలో ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడవద్దని కోరారు. రక్షణ శాఖకు సహకరించాల్సిందిపోయి తమకు ఇష్టం లేదంటూ దేశ భద్రత, సమగ్రతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలను సభ్యసమాజం ఖండించాలన్నారు. 14 ఏళ్ల క్రితమే దామగుండంలో రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

గత బీఆర్‌ఎస్ సర్కారు తీరు వల్ల ఈ పనులు ఆలస్యమయ్యాయన్నారు. ఈ రాడార్ వ్యవస్థ ఏర్పాటుతో అనేక ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. దేశ రక్షణ విషయంలో, దేశ సైనికుల విషయంలో రాజకీయాలు చేయకూడదని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను కోరుతున్నామన్నారు.

దామగుండం రెండోది 

తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్‌ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ దేశంలోని మొట్ట మొదటిదని కిషన్‌రెడ్డి తెలిపారు. అది 1990 నుంచి నావికా దళానికి సేవలందిస్తోందని చెప్పారు. దేశంలో రెండో వీఎల్‌ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్ దామగుండంలో ఏర్పాటు అవుతోందని వివరించారు. ఓడలు, జలాంతర్గాములకు సంబంధించి కమ్యూనికేషన్ వ్యవస్థను ఈ రాడార్ స్టేషన్ ద్వారా సమన్వయం చేస్తారని అన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో 2010లో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదన వచ్చిందని గుర్తుచేశారు. 

చెట్ల పరిరక్షణ కోసం రూ.130 కోట్లు 

దామగుండం అటవీ ప్రాంతంలో చెట్ల సంరక్షణ కోసం రూ.130 కోట్లు అటవీశాఖకు రక్షణశాఖ కేటాయించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. 209 ఎకరాల్లో కొంత ప్రాంతంలో మాత్రమే రాడార్ వ్యవస్థలో పనిచేసే నేవీ సిబ్బందికి అకామిడేషన్ ఏర్పాటు చేస్తారని అన్నారు. భూమి కేటాయించిన ప్రదేశంలో 1.95 లక్షల చెట్లు ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు.

ఇందులో కేవలం 1500 చెట్లను రీలొకేట్ చేస్తారని అన్నారు. చెట్లు నరికివేస్తున్నారని, దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులను వెళ్లనివ్వరంటూ తప్పుడు ప్రచారం చేయడం సరి కాదన్నారు. ఆలయానికి మరిన్ని సౌకర్యాలు కల్పించేలా రక్షణశాఖతో మాట్లాడతామన్నారు. ఎక్కడ మిలటరీ ఉంటుందో.. అక్కడ పచ్చదనాన్ని పెంపొందిస్తారని స్పష్టంచేశారు.