calender_icon.png 16 October, 2024 | 4:00 PM

కేటీఆర్.. నీ తండ్రి ఫాంహౌజ్ ఎదుట ధర్నా చెయ్!

16-10-2024 03:36:08 AM

రాడార్ నిర్మాణానికి అనుమతి ఎలా ఇచ్చారో నిలదీయ్

గతంలో మీరే అనుమతి ఇచ్చి, ఇప్పడు వ్యతిరేకించడం సరికాదు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్  

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రాడార్ నిర్మాణానికి గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ అంగీకారం తెలుపగా, ప్రస్తుతం ఆయన కుమారుడు కేటీఆర్ వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ఆనాడు సోయిలో ఉండే అనుమతి ఇచ్చారా? లేదా? అనేది కేటీఆరే తెలుసుకుంటే బాగుండేదన్నారు. కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఆయన తండ్రి ఫాం హౌజ్ ముందు ధర్నా చేయాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశా రు. దామగుండం రాడార్ స్టేషన్ ఏర్పాటు అంశం ఇప్పటిది కాదని.. 14 ఏండ్లుగా పెండింగ్‌లో ఉందని చెప్పారు.

అన్ని అడ్డంకులను దాటుకొని భూమిపూజ దాకా రావడం సంతోషంగా ఉందని తెలిపారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చొరవ వల్లే ఇది సాధ్యమైందన్నారు. గతంలో అధికారం లో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని.. దామగూడెం రిజర్వ్‌ఫారెస్ట్‌లోని 1,174 హెక్టార్ల భూమిని బదిలీ చేస్తూ 2017లో జీవో జారీ చేసిందని గుర్తు చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు ఆమోదించిన బీఆర్‌ఎస్ నేతలే ఇయాళ వ్యతిరేకిస్తున్నారంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. ఇది వాళ్ల ద్వంద్వ వైఖరిని ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. దేశభద్రత విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, అన్ని రాజకీ య పార్టీలు రాజీ లేకుండా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

బీఆర్‌ఎస్ నేతలు నేవీ రాడార్ స్టేషన్‌ను వ్యతిరేకించడమంటే దేశ భద్రతను వ్యతిరేకించడమే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహ్యించుకుంటున్నారని తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పినా వారిలో మార్పురాకపోవడం సిగ్గుచేటని బండి అన్నారు.