సాక్షుల స్టేట్‌మెంట్ రికార్డు చేసిన నాంపల్లి కోర్టు
తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తమకు తెలిసిన విషయాలన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు వారు చెప్పారు. ఈ కేసులో గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ స్టేట్‌మెంట్‌ను కోర్టు నమోదు చేసిన విషయం తెలిసిందే.
కాగా, తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా తన గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ కోర్టుకు చదివి వినిపించారు. మొత్తం 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు అందజేశారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.