03-04-2025 10:04:48 AM
హైదరాబాద్: ఢిల్లీ పార్టీల మ్యానిఫెస్టోలు చిత్తుకాగితంతో సమానమని, అడ్డదారిలో అధికారంలోకి రావడానికి అందులో చెప్పేవన్నీ మాయమాటలేనని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫ్రీ ఎల్ఆర్ఎస్(Free LRS) అని మభ్యపెట్టి, అధికారంలోకి రాగానే నాలుగున్నర లక్షల మంది నుంచి ఏకంగా రూ. 1400 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముక్కుపిండి వసూలుచేశారని మండిపడ్డారు.
మరో 15,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీచేసి ఖజానా నింపుకునేందుకు గడుపు పెంపు పేరిట మరో ఘరానా దోపిడీకి తెరలేపారని ధ్వజమెత్తారు. నాడు ఉచిత ఎల్ఆర్ఎస్ అని హామీ ఇచ్చి జనం జేబులు ఖాళీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు(Congress Govt) మాట తప్పినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) హయాంలో సంక్షేమం రూపంలో వేల కోట్లు గడప గడపకు చేరితే, కాంగ్రెస్ హయాంలో రివర్స్ గేర్ లో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేయడం పేద, మధ్యతరగతి ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.