25-02-2025 03:53:34 PM
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నాయి
10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలి
హైదరాబాద్: ఎస్‌ఎల్‌బీసీ సంఘటన జరిగి 72 గంటలు గడిచినా ఇంతవరకు ఎలాంటి విచారణ లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే బీజేపీ స్పందించలేదని కేటీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసిన ప్రధాని.. ఇంత వరకు చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు చేసినా.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు.. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)ను టార్గెట్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయని చెప్పారు. కడియం శ్రీహరి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధండా ఉండాలని కోరారు. హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ద్వజమెత్తారు. 14 నెలల్లోనే కాంగ్రెస్ పై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది చిక్కుకుంటే.. రేవంత్ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వ్యతిరేక గాలి వీస్తోంది. బీజేపీని రేవంత్ పల్లెత్తు మాట అనడని కేటీఆర్ పేర్కొన్నారు.