26-02-2025 03:39:57 PM
ప్రభుత్వ చర్యలను తప్పుపట్టిన కేటీఆర్
నంబర్ వన్ రాష్ట్రాన్ని దివాలా తీసే స్థితికి తెచ్చారు.
హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యాలు చేశారు. చేతకాని పాలనతో తెలంగాణను పూర్తిగా ఆగం చేసి, వాస్తవాలను బయటపెట్టిన అధికారులపై కక్షకట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ (అట్లాస్) రిపోర్టుతో బీఆర్ఎస్ దార్శనిక పాలనకు, కాంగ్రెస్ పాలనకు ఉన్న స్పష్టమైన తేడా, నాలుగు కోట్ల సమాజం ముందు బట్టబయలు కావడంతో ముఖ్యమంత్రికి మింగుడుపడటం లేదన్నారు. స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ నివేదిక(Statistical abstract report)పై ప్రభుత్వం చర్యలను కేటీఆర్ తప్పుపట్టారు.
బీఆర్ఎస్ హయాంలో సాధించిన ఘనమైన గతాన్ని తొక్కిపెట్టడం, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ఈ సీఎం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. 14 నెలలుగా ప్రధాన ప్రతిపక్షంపై సాగిస్తున్న రాజకీయ కక్ష(Political party) సాధింపు చాలదన్నట్టు, ఇప్పుడు అధికారులనూ వేధిస్తున్నారని మండిపడ్డారు. తలసరి ఆదాయంలో నంబర్ వన్ గా ఉన్న రాష్ట్రాన్ని, తలకు మాసిన నిర్ణయాలతో దివాళా తీసే స్థితికి తెచ్చి ఇప్పటికే క్షమించరాన్ని పాపాన్ని మూటగట్టుకున్నారని ఆరోపించారు.
వాస్తవ గణాంకాలను జీర్ణించుకోలేక, తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఈ చిల్లర చేష్టలు మానుకుంటే మంచిది కేటీఆర్ కాదని హితువు పలికారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) పదేళ్ల పాలనలో వ్యవసాయరంగంలో సాధించిన విప్లవం, పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టిన ప్రగతి పథం.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా పదిలంగా ఉందన్నారు. కేవలం వైబ్ సైట్ నుంచి రిపోర్టులను తొలగించినంత మాత్రాన, చేయని తప్పుకు అధికారులపై వేటు వేసినంత మాత్రాన.. తెలంగాణ పదేళ్ల ముఖచిత్రాన్ని, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన స్వర్ణయుగాన్ని చెరిపేయడం ఈ ముఖ్యమంత్రి వల్లే కాదు.. ఢిల్లీ పార్టీ ముత్తాతలకు కూడా సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సాధించిన ఘనతలను తొక్కిపెట్టడం ఎవరికీ సాద్యం కాదని ఆయన సూచించారు.