calender_icon.png 24 November, 2024 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావ్

24-11-2024 12:14:44 PM

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నరంలేని నాలుక ఏదైనా మాట్లాడుతుం దన్నారు. అది నోరైతే నిజాలు వస్తాయి-అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయని ద్వజమెత్తారు. పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావ్ అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కొడంగల్ లో భూసేకరణ ఫార్మా విలేజ్ ల కోసం అని స్పష్టంగా వెల్లడిస్తుందన్న కేటీఆర్, ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేస్తివి.. తొండలు గుడ్లు పెట్టని భూములు  అంటూ బాతాఖానీ కొడితివని ప్రశ్నించారు. 

మీ అన్న తిరుపతి  లగచర్ల చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా?, ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా? అని ప్రశ్నించారు. ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నావ్ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నావని ఆరోపించారు.