హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంపై చెరిగిపోని సంకతం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2001న గులాబీ జెండాను ఎగరవేసి, తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి, ఉద్యమ చరిత్రపై చెరిగిపోని ముద్రవేసిన మహానాయకులు కేసీఆర్ అని గుర్తు చేశారు. 2009 నవంబర్ 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టారని, ఆనాడు ఉద్యమ సమయంలో ఉన్న నిర్భంధాలు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని రేవంత్ సర్కార్ పై కేటీఆర్ మండిపడ్డారు.
కేసీఆర్ స్పూర్తితో మళ్లీ కేంద్ర పార్టీల మెడలు వంచాల్సిన అవసరం ఉందని, అందుకు మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నవంబర్ 26న సన్నాహక సమావేశాలు, 29న నిమ్స్ లో అన్నదానం కార్యక్రమం, డిసెంబర్ 9న మేడ్చల్ లో తెలంగాణ తల్లికి ప్రణమిల్లే కార్యక్రమాలను చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఆనాటి కార్యక్రమాలు, ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చే విధంగా మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ దుర్మార్గ కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.