హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు(Former Minister KT Rama Rao) గురువారం ఫార్ములా-ఈ రేస్ కేసు(Formula-E race case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య, ఆయన ఉదయం 10.45 గంటల ప్రాంతంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. కేటీఆర్(KTR)తో కలిసి ఒక న్యాయవాదిని ఈడీ కార్యాలయంలోకి అనుమతించారు.
ఈడీ కార్యాలయంలో ఉద్రిక్తత
కేటీఆర్ కు సంఘీభావం ప్రకటించడానికి అనేక మంది బీఆర్ఎస్ నాయకులు(BRS leaders) గుమిగూడడంతో ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వారు నిరసన ప్రదర్శన నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు సహా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు వ్యాన్లలో తరలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కి సంఘీభావం తెలిపేందుకు ఈడీ కార్యాలయం వెలుపల గుమిగూడిన వారిలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్(Gangula Kamalakar), శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమమ్మెల్సీలు ఉన్నారు. ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు దాదాపు 200 మంది పోలీసులను మోహరించారు. మోహరించిన అధికారులలో ముగ్గురు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, ఎనిమిది మంది ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యగా టియర్‌గ్యాస్ వాహనాలు,వాటర్ కెనాన్‌లను కూడా సిద్ధంగా ఉంచారు.
పీఎంఎల్ఏ కింద ఈడీ దర్యాప్తు
అవినీతి నిరోధక సంస్థ (ACB) దాఖలు చేసిన మొదటి సమాచార నివేదిక (FIR) ఆధారంగా ED మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద దర్యాప్తు నిర్వహిస్తోంది. విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనలను కేంద్ర సంస్థ పరిశీలిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (Hyderabad Metropolitan Development Authority) మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది.
FEMA, PMLA నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (FEO) కు విదేశీ మారకంలో సుమారు రూ. 55 కోట్ల బదిలీకి సంబంధించిన వివిధ అంశాల గురించి కేటీఆర్ ను ఈడీ(ED) ప్రశ్నించే అవకాశం ఉంది. డబ్బు బదిలీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) నుండి ఎందుకు అనుమతి తీసుకోలేదని మాజీ మంత్రిని ప్రశ్నించే అవకాశముంది. స్థిర ఆర్థిక విధానాలను పాటించకుండా HMDA ద్వారా FEO అనుబంధ సంస్థలకు చెల్లింపులలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ గత నెలలో కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13 (1) (A), 13 (2) కింద, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 409, 120 (B) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.