* 16న విచారణకు ఈడీ పిలుపు
* రేపు ఏసీబీ విచారణ
* బీఎల్‌ఎన్‌రెడ్డినీ విచారించనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): ఫార్ములా ఈకార్ రేస్ కేసు కేటీఆర్ మెడకు చుట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఇదో లొట్టపీసు కేసు అంటూ వ్యాఖ్యానించి ఈ కేసు స్థాయిని తక్కువ చేయాలని చూసిన కేటీఆర్.. చివరకు అదే కేసులో ఇరుక్కుపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ కేసుకు సంబంధించి మంగళవారం హైకోర్టు తన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన వెంటనే సుప్రీం కోర్టును కేటీఆర్ ఆశ్రయించినా అప్పటికే సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసి అక్కడ కూడా అవకాశం లేకుండా చేసేందుకు సిద్ధమైంది.
ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే తమకు సమాచారం అందించాలని కోరింది. మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ నెల 16న విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్‌కు రెండోసారి నోటీసులు అందించింది.
రేపు ఏసీబీ విచారణ
ఫార్ములా ఈ రేస్ కేసులో సోమవారం విచారణకు హాజరుకావాల్సిన కేటీఆర్ తన న్యాయవాదిని అనుమతించకపోవడంతో ఏసీబీ అధికారులతో వాగ్వాదానికి దిగి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఏసీబీ విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు మరోసారి నోటీసులందించారు.
ఈ నెల 9న జరిగే విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన తర్వాత కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయనపై ఈ కేసులో నమోదైన సెక్షన్లు అరెస్టు చేసేందుకు అనుకూలంగానే ఉన్నాయని అంటున్నారు.
నేడు అర్వింద్ కుమార్ విచారణ
ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ బుధవారం ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఆయన విచారణ కోసం గతంలోనే ఏసీబీ నోటీసులు జారీచేసింది. ఈ కేసులో ఏ2గా ఉన్న అర్వింద్ కుమార్ నిధుల బదలాయింపులో కీలకంగా ఉన్నారు. తన పరిధిలో ఉన్న హెచ్‌ఎండీయే నుంచి ఎఫ్‌ఈవోకు నిధులు బదిలీ చేసినట్టు ఆరోపణలున్నాయి.
అప్పుడు హెచ్‌ఎండీయే సీఈగా ఉన్న బీఎల్‌ఎన్‌రెడ్డి ద్వారా నిధులు బదలాయించారని ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్‌ఎండీయే మాజీ సీఈ బీఎల్‌ఎన్‌రెడ్డి నేడు ఈడీ కేసు విచారణకు హాజరుకావాల్సి ఉంది. నిధులను విదేశీ సంస్థకు బదీలీ చేసిన వ్యవహారంలో ఈడీ కేసును నమోదు చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు అయింది.