16-03-2025 01:04:41 PM
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నారా గౌడ్
కామారెడ్డి,(విజయక్రాంతి): దళిత నాయకులు శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఆదివారం కామారెడ్డి జిల్లా లింగంపేటలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మ దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అనుచితంగా, అమర్యాదగా, అవమాన పరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారాగౌడ్ అన్నారు.
అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏక వచనంతో మాట్లాడి సభా మర్యాదను మంట కలిపారు అన్నారు. గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారు, లోక్ సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమార్ తెలంగాణకు వచ్చి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. నెరేళ్లకు వెళితే అరెస్ట్ చేశారు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారు. ఇలా అనేక రకాలుగా దళితులను మోసం చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని వారు హెచ్చరించారు.