హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీ మారిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలనడం తప్పా?. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరి తీయాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు. పార్టీ మారాను అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించారని కేటీఆర్ చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చారని ఆరోపించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ ఇవ్వడం ఏంటి?, అరెకపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని కోరితే దాడి చేశారని కేటీఆర్ విమర్శించారు. సీఎం చేతగానితనం వల్లే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందన్నారు. హైదరాబాద్ లో కనీసం శాంతి భద్రతలు అదుపు చేయలేకపోతున్నారని విమర్శించారు. గుండాలకు పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి కౌశిక్ రెడ్డి పై దాడికి పంపాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు. హామీలు అమలు చేయాలని కోరితే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.