calender_icon.png 22 October, 2024 | 12:32 AM

ఫిక్స్‌డ్‌ ఛార్జీల పేరిట ప్రజలపై భారం

21-10-2024 05:34:14 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారీగా విద్యత్ భారాన్ని మోపడం దారుణమని,  విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ రంగారావుకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ వెంట మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఉన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఫిక్స్ డ్ ఛార్జీల పేరిట ప్రజలపై  భారం మోపేందుకు సిద్ధమయ్యారని, అందుకు సంబంధించిన ప్రతిపాదనను తిరస్కరించాలని కేటీఆర్ పేర్కొన్నారు. పరిశ్రమలు అన్నింటికి ఒకే శ్లాబ్ వర్తింపజేయాలని ప్రతిపాదించారు.ఇప్పటికే అసంబద్ధ విధానాల వల్ల పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ అర్థరహిత ఆలోచనల వల్ల పారిశ్రామిక రంగం మరింత దెబ్బతింటుందని మండిపడ్డారు. గతంలో ట్రూ అప్ ఛార్జీలు రూ.12,500 కోట్లు చెల్లించాలని విద్యుత్ సంస్థలు కోరాయని ఆయన వెల్లడించారు. ట్రూ అప్ ఛార్జీల భారాన్ని గతంలో ప్రభుత్వమే బరించింది.. ప్రజలపై వేయలేదని కేటీఆర్ చెప్పారు.