calender_icon.png 24 October, 2024 | 7:37 PM

కాంగ్రెస్, బీజేపీ రెండూ వేరు వేరు కాదు.. దొందూ దొందే

24-10-2024 05:29:59 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ లో జరిగిన రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక ఎక్కడి పనులు అక్కడే అగిపోయ్యాయని ఆరోపించారు. ఆదిలాబాద్ వచ్చేటప్పుడు డిచ్ పల్లి వద్ద పోలీసుల భార్యలు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో పోలీస్ అన్నలతో వెట్టి చాకిరి చేయిస్తూ వారి కుటుంబాలను రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిస్తున్నారు. నాడు కేసీఆర్ పాలనలో స్పెషల్ కానిస్టేబుల్స్ 15 రోజులు డ్యూటీ చేస్తే 4 రోజులు సెలవులు ఉండేవి, కానీ నేడు రేవంత్ రెడ్డి పాలనలో 26 రోజులు నిర్విరామంగా డ్యూటీ చేస్తే, 4 రోజులు సెలవులు ఇస్తున్నారని కేటీఆర్ ధ్వజమోత్తారు. మా భర్తలకు విశ్రాంతి లేకుండా డ్యూటీలు వేసి తమకు, తమ సంసారాన్ని కుటుంబాన్ని దూరం చేస్తున్నారని పోలీసుల భార్యలు ఆవేదన చెందుతున్నరన్నారు. 

మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి, మీ పక్కనే ఉన్న మహారాష్ట్రకు వెళ్లి కాంగ్రెస్ మొత్తం అడ్డగోలు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను ఎట్ల మోసం చేశారో చెప్పాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేస్తే మీకు కూడా మోసం జరుగుతుందని మహారాష్ట్ర వాళ్లకు చెప్పాలె అని రైతులకు సూచించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ వేరు వేరు కాదు.. దొందూ దొందే అని ఆరోపించారు. గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం క్వింటాలు పత్తికి రూ.8800 ఇస్తుంది. అక్కడి కన్నా నాణ్యమైన పత్తి పండించే మన రైతన్నలకు తక్కువ ఇస్తాన్నారని విమర్శించారు. గుజరాత్ కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా? అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ రైతులు తెలంగాణ మొత్తానికి ఎట్ల పోరాటం చేయాల్నో తొవ్వ చూపెట్టిండ్రన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా, రూ. 500 బోనస్ వచ్చే వరకు రైతులకు అండగా ఉండి వారి కోసం పోరాటం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.