హైదరాబాద్: జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశం(GHMC Council Meeting)లో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్(GHMC Budget- 2025) నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా.. మరోసారి అవే కాగితాలపైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా? అంటూ ఆయన ద్వజమెత్తారు.
పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజావసరాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ(Greater Hyderabad Municipal Corporation ) అసమర్ధ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. అప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటామని ఆయన సూచించారు. అరెస్టు చేసిన కార్పొరేటర్లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే, ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని తమ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్(GHMC Council) సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లను మేయర్ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) సస్పెండ్ చేశారు. దీంతో కౌన్సిల్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల వాగ్వాదం.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కౌన్సిల్ సమావేశంలో తీవ్ర డ్రామా నెలకొంది. ప్లకార్డులు పట్టుకుని బీఆర్ఎస్ కార్పొరేటర్లు(BRS Corporators) నినాదాలు చేస్తూ మేయర్ పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిని అడ్డుకునేందుకు కాంగ్రెస్(Congress) సభ్యులు జోక్యం చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇరువర్గాల సభ్యులు తోపులాటలు, తోపులాటలతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.