03-05-2024 01:30:51 AM
బీఆర్‌ఎస్ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామన్న ఈసీ
విచారణ ముగించిన హైకోర్టు
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంబంధం ఉందంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. బీఆర్‌ఎస్ ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరిస్తామని ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ అవినాష్ చెప్పారు. దీంతో సంతృప్తి చెందిన హైకోర్టు బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఫోన్ ట్యాపింగ్‌తో కేటీఆర్‌కు సంబంధం ఉందని చేస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణలతో కేటీఆర్ ప్రతిష్ఠ దెబ్బతీశారని పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది మయూర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈసీ చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీంతో బీఆర్‌ఎస్ ఫిర్యాదుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈసీ చెప్పడంతో హైకోర్టు పిటిషన్ విచారణను ముగించింది.