calender_icon.png 9 January, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు

17-09-2024 01:17:14 AM

  1. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ విగ్రహం ఏర్పాటా? 
  2. అధికారంలోకి రాగానే గాంధీ భవన్‌కు రాజీవ్ విగ్రహం   
  3. తెలంగాణ అస్థిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధే 
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు నిరసనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదని మండిపడ్డారు.

ఇది తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ చేపట్టిన చర్యను తెలంగాణవాదులంతా వ్యతిరేకిస్తూ నిరసన తెలపాలని కోరారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై తెలంగాణ సమాజం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నదని తెలిపారు. వెంటనే తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. లేదంటే  ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని హెచ్చరించారు. 

గాంధీభవన్‌కు రాజీవ్ విగ్రహం..

కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టుకోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.  కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేసిందని అన్నారు. కాంగ్రెస్ చర్య ప్రతి తెలంగాణవాది మనసును గాయపర్చేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి గాంధీ భవన్‌కు తరలిస్తామని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

వాళ్లకు రాజకీయ సమాధే.. 

తెలంగాణ అస్తిత్వం, ప్రజల ప్రయోజనాల కన్నా కాంగ్రెస్ నాయకులకు స్వప్రయోజనాలే ముఖ్యమై పోయాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులమంటూ గొప్పలు చెప్పుకునే వారంతా ఢిల్లీకి గులామ్ లేనని తేలిపోయిందన్నారు.  కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీ బాసులకే జీ హుజూర్ అంటారన్న విషయం మరోసారి స్పష్టమైందన్నారు.  ప్రాంతం వాడే మన అస్తిత్వతాన్ని దెబ్బ తీస్తుంటే కచ్చితంగా తెలంగాణ ప్రజలు వారికి రాజకీయంగా సమాధి తవ్వటం ఖాయమని చెప్పారు.  తెలంగాణ సెంటిమెంట్‌తో పెట్టుకున్నోళ్లు ఎవరైనా రాజకీయాల్లో బతికి బట్టకట్టలేరన్న విషయం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

బీఆర్‌ఎస్ మాత్రమే శ్రీరామరక్ష..

తెలంగాణ అస్తిత్వం,  ప్రయోజనాల విషయంలో బీఆర్‌ఎస్ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ బాసుల మెప్పు కోసం కాకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ ముందు నిలబడుతుందన్నారు. కచ్చితంగా తెలంగాణకు బీఆర్‌ఎస్ శ్రీరామరక్షగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

16 రోజులైనా కరెంటు సమస్యను పరిష్కరించరా.. 

 కాంగ్రెస్ పాలనలో  కరెంట్ కష్టాలు చెప్పకోలేని విధంగా ఉన్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎక్స్ వేదిక స్పందిస్తూ  సీఎం రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు గురించి గొప్పగా చెప్పి అసలు కరెంటే లేకుండా చేశారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా మోతె మండలంలో 16 రోజులుగా కరెంటు లేదని, దీంతో రైతుల పంటలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయని తెలిపారు. భట్టి విక్రమార్క వెంటనే జోక్యం చేసుకుని విద్యుత్‌ను పునరుద్ధరించాలని కోరారు. 

పొలాలకు కరెంట్ రావడం లేదని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అధికారులకు ఫోన్లు చేసినా ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యానికి పంటలు ఎండిపోతుండటంతో సబ్‌స్టేషన్ ముందు రైతులు ధర్నా చేశారని తెలిపారు.