24-02-2025 06:49:32 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(Krishna River Management Board) ప్రత్యేక సమావేశం ముగిసింది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్(KRMB Chairman Atul Jain) నేతృత్వంలో సోమవారం సమావేశం కొనసాగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని వియోగించుకున్నందని, శ్రీశైలం నుంచి ఏపీ నీటి వినియోగాన్ని పూర్తిగా ఆపాలని తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. దీంతో ప్రస్తుత ఏడాది కృష్ణా నీటి వినియోగం లెక్కలు తేల్చాలని కృష్ణా బోర్డును తెలంగాణ ఈఎన్‌సీ కోరారు.
ఈ ఏడాది ఇప్పటికే ఏపీ తన వాటాకు మించి కృష్ణా నీటిని వాడుకుందని ఫిర్యాదు చేసింది. కేఆర్ఎంబీ స్పందించి నీటి అవసరాలపై ఇరురాష్ట్రాల సీఈలు నిర్ణయానికి రావాలని సూచించింది. సాగర్ కింద పంటల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీ చెప్పడంతో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరావు భేటీ అయ్యారు. జలసౌధలో ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు విడిగా సమావేశమయ్యారు. అయితే కృష్ణానది యాజమాన్య బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ బుధవారం సమావేశమయ్యే అవకాశం ఉంది.