calender_icon.png 30 October, 2024 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

07-07-2024 12:26:28 AM

సీఎం సమక్షంలో కండువా మార్చిన బీఆర్‌ఎస్ నేత

చేరికను వ్యతిరేకిస్తున్న జెడ్పీ చైర్‌పర్స్‌న సరిత

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి హామీ?

కాంగ్రెస్‌లోకి మరో ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు?

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి)/గద్వాల (వనపర్తి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. తాజాగా బీఆర్‌ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38 నుంచి 31 పడిపోయింది. మరో నలుగు రు బీఆర్‌ఎస్ ఎమ్యెల్యేలు కూడా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

వారు కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. మరో 19 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే బీఆర్‌ఎస్‌ఎల్పీని హస్తం పార్టీలో విలీనం చేయడానికి అర్హత సాధించినట్లు అవుతుంది. తెలంగాణలో కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్ష పార్టీల నేతలు అధికార పార్టీలోకి జంప్ అవుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ నుం చి ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీలో ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

గద్వాలలో కృష్ణమోహన్ చిచ్చు

కృష్ణమోహన్ చేరికతో గద్వాల కాంగ్రెస్‌లో కాక మొదలైంది. ఈయన చేరికను జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుగుబాటు జెండా ఎగరేశారు. కృష్ణమోహన్ చేరికను వ్యతిరేకిస్తూ గాంధీభవన్‌ను ముట్టడించి నిరసన గళాన్ని వినిపించారు.  దీంతో  అధిష్ఠానం రంగంలోకి దిగి సరితకు తగిన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌తోపాటు డీసీసీ జిల్లా మహిళా అధ్యక్షురాలి పదవిని కూ డా కట్టబెడుతున్నట్టు విశ్వసనీయం సమాచారం. కాగా, అధిష్ఠానం తీరుతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధం అవుతున్నది. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరితకు ఆహ్వానం పంపినట్టు తెలిసింది. ఒకవేళ ఇదే జరిగితే రాజకీయం మరింత రసవత్తంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

గ్రేటర్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు?

బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి దూకేందుకు సిద్ధమైనట్టు సమాచారం. వీరంతా గ్రేటర్ హైదరాబాద్‌కు చెందినవారేనని తెలిసింది. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. శనివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ కలిశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కానీ, అసలు విషయం పార్టీ మారటంపైనే అని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు రేపోమాపో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా కాంగ్రెస్‌లో చేరే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంఖ్య 20 దాటుతుందని చెప్తున్నారు. 

గ్రేటర్‌పై పట్టు కోసం కాంగ్రెస్ ఫోకస్

అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో పార్టీకి పట్టుదొరకడంలేదు. అందుకోసం నగర  ఎమ్మెల్యేల చేరికపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. తరవాత జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లు, పలువురు కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. ఇప్పడు ఎమ్మెల్యేలు చేరేందుకు సమయం వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.