calender_icon.png 22 October, 2024 | 10:01 AM

శ్రీశైలానికి కృష్ణమ్మ ఉరకలు

29-07-2024 12:28:55 AM

  1. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
  2. కృష్ణ, తుంగభద్ర నుంచి 4,41,222 క్యూసెక్కులు
  3. నేటి రాత్రి వరకు గేట్లు ఎత్తే అవకాశం?
  4. రెండు రోజుల్లో నాగార్జునసాగర్‌కు నీళ్లు!

హైదరాబాద్, జులై 28 (విజయక్రాంతి): శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ఆదివారం కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి 4,41,222 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఏపీ పవర్ హౌస్ నుంచి 27,489 క్యూసెక్కులు, తెలంగాణ పవర్ హౌస్ నుంచి 33,549 క్యూసెక్కులను సాగర్ దిశగా వదులుతున్నారు. ఎగువ నుంచి ఇంకా వరద పెరుగుతున్న నేపథ్యంలో రెండు రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణలో వర్షాలు తక్కువగానే ఉన్నా మహా రాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాల ప్రభావంతోనే ఈసారి కృష్ణానదికి వరదఆశాజనకంగా వస్తున్నదని అధికారులు చెప్పారు. వరద ఇంకా కొనసాగడంతోరిజర్వాయర్లను పూర్తి నీటిమట్టంతో నింపాలని రైతులు కోరుతున్నారు. 

శాంతించిన గోదావరి

భద్రాచలం, జూలై 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది శాంతించింది. శనివారం ఉధృతంగా ప్రవహించి మూడో ప్రమాద హెచ్చరిక వరకు చేరిన గోదావరి ప్రవాహం.. అదేరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి శాంతించింది. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు అత్యధికంగా 53.60 అడుగులకు చేరిన గోదావరి  ప్రవాహం.. క్రమంగా తగ్గుతూ ఆదివారం సాయంత్రం 7   గంటలకు 48.40 అడుగులకు చేరుకున్నది. ఆదివారం అర్ధరాత్రికి 48 అడుగులకు చేరుకోవవడంతో రెండో ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించుకోనున్నారు.

మంత్రి తుమ్మల ఆదేశానుసారం పట్టణంలోకి వరద నీరు ప్రవేశించకుండా శాశ్వత చర్యలు తీసుకోవాడానికి ప్రణాళిక తయారు చేయమన్న నేపథ్యంలో.. ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం ఆర్డీవో దామోదర్. నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పట్టణంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించారు. గోదావరి వరద నెమ్మదిగా తగ్గినా భద్రాచలం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే మార్గాలు ఇంకా బ్యాక్ వాటర్‌తోనే నిండి ఉన్నాయి. దీంతో రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు. గోదావరి వరద నీరు భద్రాచలం పట్టణంలోకి ప్రవేశించకుండా కూనవరం రోడ్డులో హైవేను మూసివేశారు. ఫలితంగా ఛత్తీస్‌గడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రయాణికులు భద్రాచలంలోనే పడిగాపులు కాస్తున్నారు. 

మేడిగడ్డ బరాజ్‌కు తగ్గిన ఇన్‌ఫ్లో

జయశంకర్ భూపాలపల్లి(విజయక్రాంతి): గోదావరితో పాటు ప్రాణహిత నదులకు వరద తగ్గడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం వద్ద వరద ఉధృతి తగ్గింది. ఆదివారం సాయంత్రం వరకు కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 9.960మీటర్ల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో మేడిగడ్డ బరాజ్‌కు వరద ఉధృతి తగ్గింది. ఆదివారం సాయంత్రం వరకు మేడిగడ్డ బరాజ్‌కు 4.29లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 85గేట్లు ఎత్తి అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 

ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా..

కృష్ణా బేసిన్.. (ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి)

ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుత నిల్వ ఇన్‌ఫ్లో అవుట్‌ఫ్లో

(టీఎంసీల్లో) (టీఎంసీల్లో) (క్యూసెక్కులో) (క్యూసెక్కుల్లో)

అల్మట్టి 129.72 71.92 268500 325000

నారాయణపూర్ 37.64 28.57 320000 327366

ఉజ్జయిని 117.24 82.64 42261 290

జూరాల 9.66 7.97 304000 298882

తుంగభద్ర 105.79 98.22 124361 151035

శ్రీశైలం 215.81 156.39 441222 80711 

నాగార్జునసాగర్ 312.05 132.01 53774 6441

పులిచింతల 45.77 1.06 224 50

గోదావరి బేసిన్.. (ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి)

సింగూరు 29.917 14.32 3377 391

నిజాంసాగర్ 17.800 3.69 750 0

శ్రీరాంసాగర్ 90.300 32.90 22846 624

కడెం 7.600 6.36 6763 5143

ఎల్లంపల్లి 20.175 17.81 20653 12931

మేడిగడ్డ 16.170 93.30(మీ.) 406513 406513

సమ్మక్క సాగర్ 6.940 81.80(మీ) 845560 845560

దుమ్ముగూడెం 36.570 54.20 (మీ) 1165362 1165362

భద్రాచలం ఎత్తులో 48.64 (మీ) 1153429 1153429