calender_icon.png 28 October, 2024 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు

30-07-2024 12:05:00 AM

  1. శ్రీశైలం జలాశయం మూడు గేట్లు ఎత్తివేత 
  2. ప్రాజెక్టులో 879.20 అడుగులకు చేరిన నీరు
  3. సాగర్‌కు లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో

హైదరాబాద్/నాగర్ కర్నూల్/నల్లగొండ, జూలై 29 (విజయక్రాంతి): ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు 43గేట్ల ద్వారా సుమారు మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతోపాటు సుంకేసుల ప్రాజెక్టు నుంచి వరద నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుం డలా మారింది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ ఇప్పటికే నిండటం.. పరివాహక ప్రాం తాల నుంచి వరద పోటెత్తుతుండటంతో అధికారులు డ్యామ్ భద్రతను దృష్టిలో ఉంచుకొని సోమవారం మూడు గేట్లను ఎత్తారు. కర్నూల్ నీటి పారుదల చీఫ్ ఇంజినీర్ కబీర్ బాషా అధికారులతో కలిసి కృష్ణమ్మకు వాయనం సమర్పించి, గంగాహారతి ఇచ్చి క్రస్టుగేట్లు ఎత్తారు.

ప్రాజెక్టు 6,7,8 నంబర్ల గేట్లను 10 అడుగుల మేర ఎత్తి.. ఒక్కో గేటు గుండా 27 వేల క్యూసెక్కుల చొప్పున 81 వేల క్యూసెక్కులు స్పిల్ వే నుంచి నదిలోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.8070 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 879.20 అడుగులు (184. 2774 టీఎంసీలు)గా ఉంది. ఎగువ నుంచి 4,52,583 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహం అధికంగా ఉండడంతో మంగళవారం ఉదయం లేదా సాయంత్రం మరో రెండు గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జలాశయం గేట్లు ఎత్తడంతో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున భద్రత ఏర్పాట్లు చేస్తున్న ట్లు పోలీసులు తెలిపారు.

శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ వైపు భారీ గా ప్రవాహం వస్తుండటంతో తెలుగు రాష్ట్రా ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరి తాగు, సాగునీరు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో కృష్ణమ్మ కరుణించడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రవాహం ఇదే రీతిన వారం నుంచి పదిరోజుల పాటు కొనసాగితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సైతం నిండే అవకాశం ఉంది. కనీసం 550 అడుగులకు చేరినా రెండేండ్ల పాటు సాగునీటికి ఢోకా ఉండదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాల్వల పరిధిలో దాదాపు 22 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది.

గోదావరికి పెరిగిన వరద

జయశంకర్ భూపాలపల్లి(విజయక్రాంతి): వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరి నదికి క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతూనే ఉన్నది. ఆదివారం సాయం త్రం వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గోదావరి పుష్కర ఘాట్ వద్ద వరద ప్రవాహం తగ్గగా సోమవారం సాయంత్రం వరకు వరద ప్రవాహం నాలుగు మెట్లకు పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద ఉధృతి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మిబరాజ్ మేడిగడ్డకు అదేస్థాయిలో వరద కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం వరకు 4.75లక్షల క్యూసెక్కుల నీళ్లు ఇన్ ఫ్లో ఉండగా 85గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. గోదావరికి వరద ఉధృతి మరింత పెరిగితే మేడిగడ్డకు ఇన్‌ఫ్లో పెరిగనుంది.