తుంగభద్రలో పెరుగుతున్న నీటి మట్టం
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): కృష్ణాబేసిన్‌లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి 1.78 లక్షల క్యూసెక్కుల వరదను దిగువనకు విడుదల చేస్తున్నారు. మరోవైపు భీమానదిపై ఉన్న సన్నథి రిజర్వాయర్ నుంచి కూడా శుక్రవారం రాత్రి 8 గంటలకు 1.45 లక్షల క్యూసెక్కులను జూరాల ప్రాజెక్టుకు వదిలారు.
కృష్ణా, భీమా నుంచి జూరాలకు భారీగా వరద వస్తోంది. దీంతో జూరాల నుంచి 45 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువనకు 3.31 లక్షల క్యూసెక్కులను శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టుకు క్రమేపీ పూర్తి నీటిమట్టానికి చేరుకుంటోంది. ఫలితంగా ప్రాజెక్టుపై ఆధారపడి న ఏపీ, కర్ణాటకతో పాటు తెలంగాణ ఆర్డీఎస్ రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
సాగర్‌కు 3 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నల్లగొండ(విజయక్రాంతి): నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3.12 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహం వస్తోంది. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు మొత్తం 26 క్రస్టుగేట్లలో 8 గేట్లను పది అడుగులు, 18 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి స్పిల్ వే గుండా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. నాగార్జు న సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5050 టీఎంసీలు) వద్ద స్థిరంగా కొనసాగుతున్నది.