calender_icon.png 31 October, 2024 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోయ సంగీతం తూతకొమ్ము

31-10-2024 12:00:00 AM

తూతకొమ్ము చాలా ప్రాచీనమైన వాద్యం. ప్రకృతిలో లభించిన అనాది వాద్యం కూడా. మరణించిన జంతువుల కొమ్ములు, ఎముకలు శబ్దానికి హేతువు అని తెలుసుకున్నాక వాటికి చిన్న పాటి చేర్పులు మార్పులు చేసి వాద్యంగా మలుచుకున్నారు. ఆ తర్వాత సుషిర వాద్యాలలో వెదురు తదితర కర్రగొట్టాలు కొన్ని తయారయ్యాయి. జంతువుల తొడ ఎముకలు, కొమ్ములతో చేసిన వాద్యాలు సుమేరియా తదితర నాగరికతల్లో కనిపిస్తాయి. మనవద్ద ఈ అత్యంత ప్రాచీన వాద్యం ఆదివాసులలో ఇంకా సజీవంగా ఉంది.

అడవి దున్న, కొమ్ముతో తయారైన ఊదేవాద్యం తూతకొమ్ము. అర్ధచంద్రాకారంలో ఉంటుంది. కోయ సమాజంలో ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టేముందు దీనిని మోగిస్తారు. వేట ప్రారంభంలో ఊదుతారు. వేట పడినటప్పుడు ఉత్సాహంతో మోగిస్తారు. కొలుపుల ప్రారంభంలో నృత్యాలు మొదలు పెట్టేప్పుడు దీనిని శుభసూచకంగా మోగిస్తారు.

తూతకొమ్ము వాయించేప్పుడు తుతుతుత్తూ అనే శబ్దం వస్తుంది. కాబట్టి ‘తూత కొమ్ము’ అని పేరొచ్చింది. కొన్ని రకాల ప్రాచీన వాద్యాలను తుతర, తుత్తరలు అని అంటారు. ఇది ఊదే వాద్యమే కానీ ఊదడానికి పీక (మౌత్ పీస్) ప్రత్యేకంగా లేదు. పెదాలను చివర బిగించి గాలిని ఊదుతారు. ఊదే విధానం తేలిగ్గా ఉంటే తేలికైన శబ్దం వస్తుంది. ఎక్కువగా గట్టిగా ఊదితే ధ్వని పెరుగుతుంది. 

జంతువుల కొమ్ములతో చేసిన కారణంగా ఇవి కొమ్ము బూరలైనాయి. గానీ లోహాలతో నగిషీలు తాపడం చేసిన వాటిని కూడా కొమ్ములు (ద్రవిడ పదం కొంబు) అనే పిలుస్తున్నారు. కొమ్ములను యుద్ధానికి బయలుదేరే ముందు, యుద్ధసమయాల్లోనూ మోగిస్తారు. దీనిని కోయలు ప్రీతితో వాయిస్తారు.

ప్రస్తుతం అడవి దున్నలు తగ్గిపోయిన కాలంలో ఈ వాద్యాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. కానీ పాత కాలానికి చెందిన కొన్ని కొమ్ములు మాత్రం మిగిలున్నాయి.