calender_icon.png 31 October, 2024 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోకాపేట భూమిని అగ్గువకు కొట్టేశిర్రు

25-07-2024 12:39:41 AM

బీఆర్‌ఎస్‌పై మంత్రుల ఆరోపణ 

శాసనమండలి సమావేశాలు ప్రారంభం

రైతు భరోసా, గృహజ్యోతి, గృహలక్ష్మి తదితర అంశాలపై చర్చ

సమాధానమిచ్చిన మంత్రులు భట్టి, ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): రాష్ట్ర శాసనమండలి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. గంధమల్ల రిజర్వాయర్ పూర్తి, రాష్ట్రంలో పెద్దమ్మ తల్లి ఆలయాల నిర్మాణం, కోకాపేట భూముల కేటాయింపు, గృహలక్ష్మి పథకం, బీపీఎల్ కుటుంబాలకు ఆరోగ్య భద్రత కార్డులు, రైతు భరోసా కార్యక్రమం, ఆరు హామీల పథకం కింద కొత్త రేషన్ కార్డుల జారీ, గృహజ్యోతి పథకం, రాష్ట్రంలో నీటి సంక్షోభం, పెండింగ్ డీఏల విడుదలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానమిచ్చారు.

కోకాపేటలో ఎంతో విలువైన 11 ఎకరాల భూములను గత ప్రభుత్వ హయాంలో చాలా కారు చౌకగా బీఆర్‌ఎస్ పార్టీకి కేటాయించారంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అడిగిన ప్రశ్నకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానం ఇస్తూ.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కంటే అత్యధిక స్థలాన్ని బీఆర్‌ఎస్ పార్టీ తీసుకుందని తెలిపారు.  

మూణ్నాలుగు నెలల్లో తుమ్మిడిహెట్టి పనులు.. 

తుమ్మిడిహట్టి, గంధమల్ల రిజర్వాయర్లపై సభ్యులు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నలకు రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తుమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు కట్టే అంశంపై ప్రభుత్వం స్పందించాలని జీవన్‌రెడ్డి కోరారు. అక్కడ కడితే పుష్కలంగా నీళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి కట్టుబడి ఉందని  మంత్రి స్పష్టం చేశారు. మూడు నాలుగు నెలల్లో పనులు మొదలు పెడతామని, సాంకేతిక నిపుణులతో మాట్లాడిన తర్వాత పనులు ప్రారంభిస్తామన్నారు. సుందిళ్ల, మేడిగడ్డ ప్రాజెక్టులపై నేషనల్ డ్యాం సేఫ్టీ ఆథారిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సుందిళ్ల బ్యారేజ్ వద్ద ఇంకా సీపేజ్ ఉందని.. మేడిగడ్డ ఉపయోగంలోకి రాకున్నా అన్నారం, సుందిళ్ల ఉపయోగంలోకి వస్తే వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో పరిశీలిస్తామన్నారు. మరోవైపు గంధమల్ల రిజర్వాయర్ అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సభలో ప్రస్తావించారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే ఆలేరు ప్రాంతానికి లాభం చేకూరుతుందని, ఈ బడ్జెట్‌లో గంధమల్ల రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గంధమల్ల కోసం ఇప్పటివరకు రూపాయి పని కూడా జరగలేదని మంత్రి ఉత్తమ్ సమాధానమిచ్చారు. ప్రాజెక్టు భూసేకరణపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. స్థానికులు భూసేకరణకు సహకరిస్తే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. 

ఆగస్టు 31లోపు రైతుభరోసా..

ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 31 లోపు రైతులకు రైతుభరోసా అందిస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. రైతుభరోసాపై సభ్యులు వాణీదేవీ, రవీందర్ రావు, తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల సమాధానం ఇచ్చా రు. పెట్రోల్ బంకులు, వెంచర్లు, అనర్హులకు రైతుభరోసా ఇవ్వొద్దని తీన్మార్ మల్లన్న విజ్ఞప్తి చేశారు. సీజన్ అయిపోతుందని ఇప్పుడు ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఎమ్మెల్సీ వాణీదేవి సభ దృష్టికి తీసుకువచ్చారు. కొత్తగా రూ. 15వేల చొప్పున రైతులకు రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి తెలిపారు. కౌలు రైతులకు సహకరించేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చిస్తామన్నారు. 

రాష్ట్రంలో తాగు నీటి సమస్య లేకుండా చేస్తాం...

రాష్ట్రంలో నీటి సంక్షోభం తలెత్తబోతోందని ఎమ్మెల్సీ మధు అడిగిన ప్రశ్నకు మంత్రులు ఉత్తమ్, తుమ్మల సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే లక్షలాది క్యూసెక్కుల నీరు మేడిగడ్డ నుంచి వృథాగా దిగువనకు వెళ్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గోదావరికి వరద రావడం లేదని ప్రాణహిత, ఇంద్రావతి నుంచి మాత్రమే వరద వస్తోందన్నారు. ఫలితంగా ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్‌లో నీటి లభ్యత లేదన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య లేకుండా చూసే బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. 

  1. కస్తూర్భా పాఠశాలలు, గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని సభ్యుడు నర్సిరెడ్డి కోరారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసినప్పుడు కనీసం వీరికి మినిమం పే ఇవ్వడం న్యాయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. 
  2. యురేనియం తవ్వకాల కోసం నల్లమలలో చెంచులను బలవంతంగా తరలించాలనే ప్రయత్నం జరుగుతోందని దీన్ని అడ్డుకుని అడవి బిడ్డలను అడవిలోనే ఉండనివ్వాలని సభ్యుడు గోరెటి వెంకన్న కోరారు. చెంచులకు సరైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 
  3. ఉపాధ్యాయ బదిలీల కారణంగా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని దీనిని దృష్టిలో ఉంచుకుని.. కనీసం విద్యా వాలంటీర్లను అయినా నియమించాలని సభ్యుడు నవీన్ రెడ్డి కోరారు. 
  4. జనవరి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రాష్ట్రంలో 13 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని సభ్యుడు రమణ పేర్కొంటూ.. నేతన్నలను బతికించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నేతన్న బీమా, పింఛన్లు, థ్రిఫ్ట్ ఫండ్ తదితర పథకాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. చనిపోయిన నేత కార్మికుల కుటుంబాలకు రూ. 20 లక్షల సాయమందించాలన్నారు. 
  5. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల కొరత ఉందని అందుకే ఇప్పుడు ఉన్న పదవీ విరమణ వయసును పెంచాలని సభ్యుడు నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు. 
  6. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రం లో అంతా కలిపి 165 మంది మాత్రమే ఉన్నారని, వీరి ప్రోటోకాల్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకునాలని సభ్యుడు శేరి సుభాష్ రెడ్డి కోరారు. 
  7. నిరుద్యోగ న్యాయ పరమైన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై సభ్యుడు శేరి సుభాష్ రెడ్డి ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. 
  8. మండలి మాజీ సభ్యుడు శ్రీనివాస్ మృతిపై సభ సంతాపం తెలిపింది. 
  9. అనంతరం మండలిని గురువారానికి వాయిదా వేశారు. 

ఒక్క నెలలో 200 యూనిట్లు దాటితె రంది లేదు 

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న గృహజ్యోతి పథకానికి అర్హత ఉండి కూడా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండలి వేదికగా శుభవార్త చెప్పారు. గృహజ్యోతి పథకానికి సంబంధించి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఈ పథకానికి అర్హత కలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని వారు సమీప మండల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్నవారు డివిజన్ ఆఫీసుల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమమని.. దరఖాస్తు  చేసుకోని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడిన ఏ కుటుంబానికైనా జీరో బిల్లులు ఇస్తున్నామని, ఇందులో ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు. గృహజ్యోతి స్కీమ్ లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయలేదని, గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించామని పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తులను వడబోసి అర్హత ఉన్న వారందరికీ జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఈ జూలై వరకు 1,79,33,430 మందికి రూ. 640.94 కోట్లు డిస్కంలకు ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తెలిపారు. 

పెండింగ్ ఇండ్లను పూర్తి చేస్తాం..

రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం పై సభ్యులు తాతా మధు, జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం రూ. 3 లక్షలతో ఇంటి నిర్మాణానికి అవకాశమిస్తామని చెప్పిన సందర్భంలో తాము వాటికి రూ. 5 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించామని వెల్లడించారు. 

పదేళ్లలో బీఆర్‌ఎస్ ఇచ్చింది గుండు సున్నా.. 

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ఎమ్మెల్సీ వాణీదేవీ అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానమిచ్చారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని కారణంగా చాలా మంది పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుందని స్పష్టం చేశారు. రేషన్, ఆరోగ్యశ్రీ పథకాలకు వేర్వేరు కార్డులు ఇష్యూ చేయబోతున్నామని ప్రకటించారు.

రేషన్ కార్డులు రేషన్ కోసం మాత్రమే ఉపయోగపడతాయని, ఆరోగ్య శ్రీ కార్డులకు రేషన్ కార్డులకు లింక్ లేదని తెలిపారు. అలాగే రేషన్ కార్డులకు, ఆరోగ్య శ్రీ కార్డులకు కొత్తగా విధి విధానాలను సిద్ధం చేసి ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇందుకోసం త్వరలో మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేంద్రం తెలంగాణలో కేవలం 54 లక్షల బీపీఎల్ కుటుంబాలు మాత్రమే ఉన్నట్లు చూస్తోందని కానీ అది నిజం కాదన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని సమాచారం ఇచ్చారు.