వేడుకల్లో పాల్గొన్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి)/ముషీరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం శనివారం ప్రారంభమైంది. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా సమస్త పుణ్యనది జలాలతో కాశీస్ఫటిక లింగానికి శతఅష్టోత్తర శంఖాభిషేకం నిర్వహించారు. భక్తులతో కోటి మల్లెల అర్చన నిర్వహించారు. అపమృత్యు దోషాలు హరించే కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం నిర్వహించారు. ఆది దంపతులను హంస వాహనంపై దర్శింపజేశారు. తుని తపోవనం పీఠాధిపతి సచ్చితానందసరస్వతి స్వామి ఆశీర్వచనం చేశారు. నంబూరు శ్రీకాళీ వనాశ్రమాధిపతి శ్రీ చంద్రకాళీప్రసాద్ మాతాజీ అనుగ్రహభాషణం చేశారు. డాక్టర్ మైలవరపు శ్రీనివాస్ ప్రవచనామృ తం చేశారు. తొలిరోజు జరిగిన పూజల్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, జస్టిస్ సూరేపల్లి నంద పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు దీపాల వెలుగులు, సప్త హారతుల కాంతుల్లో మహాదేవునికి నీరాజనాలు పలికారు