calender_icon.png 25 October, 2024 | 4:01 AM

తెలంగాణలో కొరియా షూ కంపెనీ

25-10-2024 01:46:07 AM

  1. రూ.300 కోట్లతో అత్యాధునిక షూ ఉత్పత్తి కేంద్రం
  2. ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూ ఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో కర్మాగారం ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో అత్యాధునిక షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని షూ ఆల్స్ ప్రతినిధులు కోరినట్టు ఆయన వెల్లడించారు. కొరియా నుంచి వచ్చిన షూ ఆల్స్ చైర్మన్ చెవోంగ్ లీతో పాటు సంస్థ ప్రతినిధులు గురువారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును కలిసి 87 వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కే ‘గిగా ప్యాక్టరీ’ ప్రతిపాదనను వెల్లడించారు.

అడుగు భాగాన(సోల్స్) మెడికల్ చిప్ ఉండే బూట్లు, పది వేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే షూతోపాటు డయాబెటీస్, ఆర్థరైటిస్ ఉన్న వారికి ఉపశమనం, స్వస్థత కలిగించే పలు రకాల ఉత్పత్తుల తయారీ కోసం 750 ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రతిపాదించినట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

షూ ఆల్స్ అభ్యర్థన అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భారీ కర్మాగారం నెలకొల్పి ఇక్కడి నుంచే దేశీయ అవసరాలకు, అమెరికాతోపాటు ప్రపంచ మార్కెట్లకు షూ సరఫరా చేస్తారని వివరించారు.

బూట్ల తయారీలో జంతువుల చర్మాన్ని వినియోగించడం వల్ల ట్యానరీలు అవసర మవుతాయని, ఇలా యాన్సిల్లరీ పరిశ్రమలతో అనేక మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. బూట్ల అడుగుభాగాన జీపీఎస్ ఉండే షూల వల్ల పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ట్రాక్ చేయొచ్చని తెలిపారు. 

5 వేల ఎకరాలు కేటాయిస్తే స్మార్ట్ హెల్త్ సిటీ..

అమెరికాలోని జాన్ హాప్కిన్స్ లాంటి ప్రఖ్యాత హాస్పిటళ్లను తీసుకురావడంతోపాటు పరిశోధన కేంద్రాలు, బయో మెడికల్ సెంటర్లు, యాన్సిలరీ పరిశ్రమల కోసం 5 వేల ఎకరా లు కేటాయిస్తే ఏషియాలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్ హెల్త్ సిటీని నెలకొల్పే ప్రతిపాదన కూడా కొరియా బృందం చేసిందని శ్రీధర్‌బాబు తెలిపారు.

స్మార్ట్ హెల్త్ సిటీ ఏర్పాటుతో లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని వివరించినట్టు మంత్రి వెల్లడించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేసే పక్షంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పినట్టు తెలిపారు. షూ ఆల్స్ కొరియన్ బృందంలో ఇన్హీలీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఇండియా) డాంగ్ యివోస్ కిమ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జేహెన్ పార్క్ ఉన్నారు.