మన్సూరాబాద్ డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి..
ఎల్బీనగర్: సీసీ రోడ్ల నిర్మాణాలతో కాలనీల్లో ప్రజలకు రవాణా తిప్పలు తీరుతాయని, మన్సూరాబాద్ డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని బొమ్మల గుడి నుంచి కుంట్లూర్ వెళ్లే ప్రధాన మార్గం ఎన్నో సంవత్సరాల నుంచి మట్టి రోడ్డుగా ఉన్నది. మట్టి రోడ్డును సీసీ రోడ్డుగా మార్చుతానని, ఇచ్చిన మాట ప్రకారం సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. బొమ్మలగుడి నుంచి కుంట్లూర్ వెళ్లే రోడ్డు పూర్తయితే వివిధ కాలనీలకు లింక్ రోడ్డుగా మారుతుందన్నారు. దుర్గా నగర్, విష్ణు నగర్ కాలనీ, శివం హిల్స్ కాలనీ వద్ద నుంచి ప్రగతి నగర్ కాలనీ, ప్రియదర్శిని కాలనీ వరకు రోడ్డు అందుబాటులోకి వస్తుందన్నారు.
రూ. 23 లక్షలతో చేపట్టనున్న రోడ్డు పనులను సోమవారం వివిధ కాలనీ సంక్షేమ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జటిలమైన సమస్యను పరిష్కరించామన్నారు. రోడ్డు పనులను ప్రారంభించడంతో వివిధ కాలనీల నాయకులు కార్పొరేటర్ నర్సింహరెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో దుర్గా నగర్, శివం హిల్స్, ప్రగతి నగర్, ఆకాష్ నగర్, పవనగిరి కాలనీ, ప్రియదర్శిని కాలనీ, విష్ణు నగర్, రాజ రాజేశ్వరి కాలనీ, విజయనగర్ కాలనీల సంక్షేమ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.