calender_icon.png 25 September, 2024 | 7:54 AM

కొండపోచమ్మ సాక్షిగా.. నల్లపోచమ్మ చెరువు కబ్జా

25-09-2024 04:40:42 AM

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమించి నిర్మాణాలు

అక్రమంగా లేఅవుట్లతో వెంచర్ వేసిన రియల్టర్లు

బఫర్ జోన్‌లో ఎండోమెంట్ దుకాణ సముదాయం

సర్కార్ స్పందించి చెరువును కాపాడాలని స్థానికుల డిమాండ్

గజ్వేల్/జగదేవ్‌పూర్, సెప్టెంబర్ 24: జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ కొండ పోచమ్మ ఆలయం తెలంగాణలోనే ప్రఖ్యాత క్షేత్రం. కొమురెల్లి మల్లికార్జునస్వామి చెల్లెలే ఈ కొండ పోచమ్మ అని స్థానిక పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడికి నిత్యం వందలాది మంది భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు.

పోచమ్మ సాక్షిగా ఆయలం పక్కనే చేర్యాల మండలం నాగపురినాగపురి రెవెన్యూ పరిధిలోని నల్ల పోచమ్మ చెరువు కబ్జాకు గురైంది. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో కొందరు అక్రమంగా కట్టడాలు నిర్మించారు. రియల్టర్లు వెంచర్లు వేశారు. దశాబ్దాల క్రితం చెరువు నిండితే కొండపోచమ్మ గుట్ట వరకు వరద చేరేది.

అక్రమ నిర్మాణాల కారణంగా ప్రస్తు తం రోడ్డుకు అవతలి వరకే పరిమితమైంది. చెరువుశిఖం నాగపురి పరిధిలో 22 ఎకరాలు ఉండగా, తీగుల్ నర్సాపూర్‌లో 2.35 ఎకరాలు ఉన్నది. అలాగే మరో నాలుగు ఎకరాల వరకు తీగుల్‌నర్సాపూర్‌లో, రెండెకరాలు నాగపురి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో పదేండ్ల క్రితం కంటే ఇప్పుడు భూముల ధరలు 50 రెట్లు పెరిగాయి.

దీంతో కొందరు భూమికి అక్రమం గా పట్టాలు పుట్టించి ప్లాట్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం చెరువు ఎండిపోయిన సమయంలో పట్టాదారులు మాత్రమే సాగు చేసుకునే వెసులు బాటు ఉంది. కానీ కొందరు అక్రమార్కు లు ఎఫ్‌టీఎల్ పరిధిలో మట్టిపోసి, చదునుచేసి ఎత్తు పెంచి కట్టడాలు నిర్మిస్తున్నారు. 

ఎఫ్‌టీఎల్‌లోనే నిర్మాణాలు

నల్లపోచమ్మ చెరువు ఎఫ్‌టీఎల్ భూములను ఆక్రమించి కొందరు కట్టడాలు నిర్మించారు. మరికొందరు అక్రమ లేఅవుట్లతో వెంచర్లు వేశారు. కొండపోచమ్మ ఆలయానికి సమీపంలోని చెరువు బఫర్ జోన్‌లో దేవాదాయశాఖ ఏకంగా దుకాణ సముదాయాన్ని నిర్మించి ఆదాయాన్ని ఆర్జిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

చెరువులను కాపాడాల్సిన ఓ ప్రభుత్వశాఖ నిర్మాణాలు చేపట్టడడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్‌శాఖ అధికారులు సైతం మౌనంగా వహిస్తుండడం అనుమానాలకు తావిస్తుంది.

ఇప్పటికైనా సర్కార్ స్పందించి చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమ కట్టడాలను తొలగించాలని, చెరువుకు ఆక్రమణల చెర నుంచి విముక్తి కల్పించాలని పోచమ్మ భక్తులు కోరుతున్నారు. అలాగే ఆ చెరువు అంచును భక్తులు పుణ్యస్నానమాచరించేందుకు స్నాన ఘట్టం వంటి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.