calender_icon.png 21 September, 2024 | 5:58 PM

కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

21-09-2024 03:40:31 PM

కరీంనగర్, (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్దత కలిగిన గొప్ప రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లో తెలంగాణ ఉద్యమ నేత కొండ లక్ష్మణ్ బాపూజీ వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని ఎన్టీఆర్ బైపాస్ చౌరస్తాలో గల లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి స్థానిక కార్పోరేటర్ ఐలేంధర్ యాదవ్, పద్మశాలి సంఘం నాయకులతో కలిసి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం నినాదాలు చేస్తూ... లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను స్మరించు కన్నారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.... నిరంకుశ నిజాం వ్యతిరేక తెలంగాణ ఉద్యమ నాయకులలో కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రముఖమైన నాయకులన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో కూడ చురుకుగా పాల్గొని స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన గొప్ప నాయకులని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి... సాదించిన రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన మహా నేత అన్నారు. కేసిఆర్ నాయకత్వం మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని పోరాడిన మహానీయులన్నారు. ఆనాడే ఆంధ్రాపాలకుల చేతిలో తెలంగాణ ప్రాంతం వెనకబాటుకు గురైందని... ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని గొంతెత్తి చాటిచెప్పిన గొప్ప నేత అని గుర్తు చేశారు.

వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల్లో గొప్పగా అభివృద్ధి చెందిందని తెలిపారు. నాడు కొండ లక్ష్మణ్ బాపూజీ చూపిన చొరవ, వారి పోరాట ఫలితం, కేసిఆర్ పట్టుదలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ కన్న కలలను ఆయన ఆశయాలను ఇంకా నిజం చేసే వరకు మనమంతా కృషి చేసి తెలంగాణ ను ముందుకు తీస్కెల్లినప్పుడే వారి ఆశయాలకు సార్థకత లబిస్తుందని పిలుపు నిచ్చారు. కొండ లక్ష్మణ్ బాపూజీ ని గుర్తు చేస్కుంటూ... జయంతి, వర్థంతి వేడుకలు జరుపుకోవడం మనందరి బాధ్యత అన్నారు. భావి తరాలకు వారు చేసిన త్యాగం, పోరాట పటిమ తెలిసేలా వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ ఐలేంధర్ యాదవ్, జిల్లా పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.