05-03-2025 01:05:51 AM
జగిత్యాల అర్బన్, మార్చి4: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో మల్కా కొమురయ్య గెలుపొందడం నవ శకానికి నాంది లాంటిదని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య అన్నారు. బిజెపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య విజయం సాధించగా తపస్ ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాల తాసిల్ చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించుకుని స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవయ్య మాట్లాడుతూ గతంలో తపస్ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్సీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పార్టీతో అంటకాగి ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసారని విమర్శించారు. గత ఆరేళ్లుగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారానికి నోచుకోక ఉపాధ్యాయ లోకం ఆక్రోశంతో,ఆవేదనతో ఉందని, వారి ఆక్రోశాన్ని ఓట్ల రూపంలో వేసి మల్కా కొమురయ్య ను భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. జాతీయ వాదానికి మద్దతు పలికి కొమురయ్య గెలుపుకు సహకరించిన ప్రతి ఉపాధ్యాయునికి కృతజ్ఞతలు తెలిపారు.