26-02-2025 12:10:04 AM
బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలలో పెద్దపట్నం కీలకం
చేర్యాల, ఫిబ్రవరి 25: కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలలో ఒకటైన పెద్దపట్నం నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం రాత్రి ప్రారంభమై గురువారం తెల్లవారుజాము వరకు ఈ కత్రువు కొనసాగు తుంది. యాదవుల ఆచార ప్రకారం స్వామి వారికీ కళ్యాణం చేయడమే పట్నం వేయడం. మల్లన్న క్షేత్రంలో స్వామి వారికి రెండుసార్లు కళ్యాణం జరుగుతుంది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామివారి కళ్యాణం జరుపుతారు. మరల మహాశివరాత్రి రోజు యాదవుల సంప్రదాయ ప్రకారం పెద్దపట్నం (కళ్యాణం) వేసి స్వామి వారి కళ్యాణం జరుపుతారు.
ఇలా రెండుసార్లు మల్లికార్జున స్వామి పెళ్ళికొడుకు అవుతాడాన్న మాట. మల్లన్న క్షేత్రానికి వచ్చే భక్తులు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఒగ్గు పూజారులు మాత్రమే పట్నాలు వేస్తారు. పట్నాలు అంటే మల్లన్నకు అత్యంత ప్రీతి, మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పరిధిలోని తోట బావి దగ్గర పెద్దపట్నాన్ని ఒగ్గు పూజారులు రచిస్తారు. ఈ పట్నానికి పసుపు, కుంకుమ, తెల్ల పిండి, పచ్చ (తంగేడు ఆకుతో తయారు చేసేది ) బుకా గులాలు (గులాబీ రంగు కుంకుమ) వాడుతారు.
ఈ పెద్దపట్నం 41 వరసలతో దాదాపు 50 గజాలలో ఒగ్గు పూజారులు రచిస్తారు. పట్నంలోకి మల్లికార్జున స్వామిని ఆహ్వానించి కళ్యాణం చేసి తమ కోరికలను విన్నవించుకుంటారు. నుదుటన బండారి పెట్టి, కంకణాలు కట్టి, ఒగ్గు పూజారులు ఒగ్గు పూజ కత్రువును నిర్వహిస్తారు. ఒకవైపు పెద్ద పట్టణాన్ని రచిస్తూనే మరోవైపు ఒగ్గు కళాకారులు మల్లన్న చరిత్రను జానపద రూపంలో వివరిస్తారు.
ఒంటికొమ్ము ఉన్న శూలం...
పెద్దపట్నం వేసేముందు ఒగ్గు పూజారులు తమ ఆచారం ప్రకారం గర్భాలయంలోని మూలవిరాట్ కు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్లి కోనేట్లో స్నానం ఆచరింప చేస్తారు. పట్నం వేసే ప్రదేశంలో సుంకు పట్టిన తర్వాత గొంగళిలో బియ్యం పోసి, మైలపోలు తీస్తారు. మల్లన్న ధరించే ఒంటి కొమ్ము ఉన్న శూలం (ఒరగొమ్ము), డమరుకాన్ని నెలకొల్పుతారు. పసుపు, కుంకుమ, తెల్ల పిండి, సునేరు పంచరంగులను ప్రధమ గణాలుగా సమ్మిళితం చేసి, నిమ్మకాయతో చెత్రకన్ను నెలకొల్పి, శివలింగాన్ని చిత్రీకరిస్తారు.
భక్తులు పట్నం దాటడం...
ఉత్సవ విగ్రహాలను ఆలయ అనువంశిక అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చి, పట్నం పై పెట్టి పూజలు నిర్వహిస్తారు. తర్వాత శివసత్తులు శివ నామ స్మరణ చేసుకుంటూ పట్నం దాటుతారు. అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. వేడుక చూసేందుకు వచ్చిన భక్తులు వేడుక చూసి, పట్నం దాటి తర్వాత ముగ్గు పొడిని సేకరించుకుంటారు. ముగ్గు పొడి సేకరించేందుకు భక్తులు పోటీ పడతారు. పంట పొలాల్లో చల్లితే, పంటలు బాగా పండుతాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
గర్భగుడిలో..
మహాశివరాత్రి గర్భగుడిలో లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, స్వామివారి సేవ, ఊరేగింపు తదితర కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. ఇప్పటికే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నిఏర్పాట్లు చేసినట్లు ఈవో రామాంజనేయులు తెలిపారు.