04-03-2025 01:47:44 AM
కరీంనగర్/నల్లగొండ, మార్చి 3 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, పీఆర్‌టీయూ విజయదుందుభి మోగించాయి. సోమవారం వెలువడిన ఫలితా ల్లో కరీంనగర్--మెదక్- -నిజామాబాద్--ఆదిలాబాద్ ఉపాధ్యాయ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓటుతోనే ఘన విజయం సాధించారు.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యా య ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్‌రెడ్డి రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచారు. కరీంనగర్--మెదక్- నిజామాబాద్-- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
51% అధిగమించిన కొమురయ్య
కరీంనగర్-మెదక్- -నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కిం పు సోమవారం ఉదయం 8 గంటలకు కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియం లో ప్రారంభమైంది. మొదటి ఫలితంగా ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి రాత్రి 9:30 గంటలకు వెల్లడిం చారు.
ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓటుతోనే 51 శాతాన్ని అధిగమించడంతో ఎన్నికల కమిషన్ ఆయన గెలిచినట్లు ప్రకటించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 25,041 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 24,144 ఓట్లు చెల్లుబాటు కాగా, 897 ఓట్లు చెల్లలేదు.
మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించాలంటే 12,073 ఓట్లు సాధించాల్సి ఉండగా, బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య 12,959 ఓట్లు సాధించి విజయం సాధించారు. వంగ మహేందర్‌రెడ్డి 7,182 ఓట్లు, అశోక్ కుమార్ 2,621ఓట్లు, కూర రఘోత్తంరెడ్డి 428 ఓట్లు సాధించారు. మొదటి ప్రాధాన్యతతో 51 శాతం దాటిన మల్క కొమురయ్యను కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతలు అభినందించారు.
ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి సోమవారం రాత్రి గెలుపు పత్రాన్ని స్వీకరిం చారు. మల్క కొమురయ్య విజయం సాధించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అభినందనలు తెలిపారు. పట్టభద్రుల నియోజక వర్గంలో కూడా బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నట్లు ఆయన జోస్యం చెప్పారు.
నేటి ఉదయం నుంచి పట్టభద్రుల ఓట్ల లెక్కింపు..
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైనప్పటికీ పట్టభద్రుల స్థానానికి పోలైన ఓట్ల సంఖ్య, పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించడం ఆలస్యమైంది. రాత్రి 10 గంటల వరకు లక్షా 50 వేల ఓట్లకు సంబంధించి చెల్లని ఓట్లను గుర్తించే ప్రక్రియ కొనసాగింది.
దాదాపు 10 వేల ఓట్ల వరకు చెల్లలేదు. ఇంకా లక్ష చెల్లని, చెల్లిన ఓట్ల గుర్తింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం తెల్లవారుజామున మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన 21 టేబుళ్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మూడు షిఫ్టు ల్లో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి కౌంటింగ్ కేంద్రం వద్ద నిరంతరం పర్యవేక్షించారు. మూడంచెల భద్రత వ్యవస్థ మధ్య కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పట్టభద్రుల తుది ఫలితం వెలువడేసరికి మరొక రోజు పట్టే అవకాశం ఉంది.
నర్సిరెడ్డి గట్టిపోటీ ఇచ్చినా శ్రీపాల్‌రెడ్డిదే విజయం
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్లతో ఆయన గెలుపొందారు. యూటీఎఫ్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నుంచి ఆయనకు గట్టిపోటీ ఎదురైంది. టీపీఆర్టీయూ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్, బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
18వ రౌండ్‌లో స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్ ఎలిమినేషన్ కావడంతో ఆయనకు వచ్చిన ఓట్లను శ్రీపాల్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డికి సమానంగా కేటాయించగా శ్రీపాల్‌రెడ్డి గెలుపు కోటాను చేరుకు న్నారు. ఉదయం నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని వేర్‌హౌస్ గోదాంలో కౌంటింగ్ ప్రా రంభమైంది.
సాయంత్రం 5 గంటల వరకు అభ్య ర్థుల వారీగా తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా ఎవరికీ గెలుపు కోటాకు కావాల్సిన ఓట్లు రాలేదు. ఎన్నికల్లో మొత్తం 24,135 ఓట్ల పోలయ్యాయి. వీటిలో 494 ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన 23,641 ఓట్లలో (50 శాతం-ఫ్లస్ ఒకటి) 11,822 ఓట్లను గెలుపుకోటాగా నిర్ణయించారు.
తొలి ప్రాధాన్యత ఓట్లలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డికి 6,035, యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 4,820, టీపీఆర్టీయూ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437, స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్‌కు 3,115, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289 వచ్చాయి. ఎవరూ గెలుపు కోటాకు కావాల్సిన ఓట్లు సాధించలేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైంది.
అభ్యర్థులు సాధించిన మొదటి ప్రాధాన్యత ఓట్ల సంఖ్య కు అనుగుణంగా ఆరోహణ క్రమంలో జాబితా సిద్ధం చేసి తక్కువగా ఓట్లతో చివరి స్థానంలో నిలిచిన వారిని వ రుసగా ఎలిమినేట్ చేశారు. 18వ రౌండ్‌లో పూల రవీందర్ ఎలిమినేట్ కావడంతో ఆయనకు వచ్చిన రెండో ప్రాధా న్య ఓట్లను పోటీలో నిలిచిన పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి పంచ గా శ్రీపాల్‌రెడ్డి గెలుపుకోటా అధిగమించి విజేతగా నిలిచారు.