యోగా ఛాంపియన్ షిప్ ను కైవసం...
మందమర్రి (విజయక్రాంతి): ఇండియా యోగ స్కూల్ ఆద్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి యోగా పోటీలలో పట్టణానికి చెందిన కొంపెల్లి రమేష్ అత్యద్భుత ప్రతిభను ప్రదర్శించి యోగ చాంపియన్ గా నిలిచాడు. ఇండియా యోగ స్కూల్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలకు జిల్లా నలుమూలల నుండి సుమారు 300 మంది పాల్గొనగా యోగా పోటీలో అద్భుత విన్యాసాలతో యోగా చాంపియన్ గా నిలిచారు.
ఈ సందర్భంగా యోగా చాంపియన్ రమేష్ మాట్లాడుతూ.. పోటీలలో ఛాంపియన్షిప్ లభించడం పట్ల సంతోషం కలిగించిందన్నారు. క్రమశిక్షణ గల జీవన విధానానికి సంపూర్ణ ఆరోగ్యానికి యోగ మేలు చేస్తుందన్నారు. యోగ అభ్యాసంపై మక్కువ పెరిగి పలు శిక్షణలు పూర్తి చేశానన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలో ఎమ్మెస్సీ యోగ చేస్తున్నానని తెలిపారు. యోగా శిక్షణకు వయసుతో సంబంధం లేదని, ప్రతి ఒక్కరూ యోగాను ఆభ్యసించి ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించాలని కోరారు.
యోగా పోటీలతో పిల్లల్లో ఆసక్తి పెరిగి మంచి ఆరోగ్యం మంచి ఆలోచనలు సంస్కృతి పెంపొందుతుందన్నారు. సింగరేణి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న యోగా శిక్షణలో యోగా మాస్టర్ ముల్కళ్ల శంకర్ శిక్షణతో అద్భుత విన్యాసాలు ప్రదర్శిస్తు తన వంతుగా యోగాపై ప్రచారం నిర్వహిస్తానన్నారు. ఇదిలా ఉండగా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న పలువురు ప్రతిభ కనబరిచారు. ఎస్ శ్రీలత గోల్డ్ మెడల్, సుజాత సిల్వర్ మెడల్, మచ్చయ్య, దామోదర్, కృష్ణవేణిలు, లత సిల్వర్ మెడల్స్ అందుకున్నారు.