- తప్పు చేస్తే కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలి
- రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న సీఎం
- ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపణ
నల్లగొండ, డిసెంబర్ 21 (విజయక్రాంతి): మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం కావాల్సిన వ్యక్తి అని, కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు తీరని అన్యాయం జరుగుతుందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వ్యాఖ్యానించారు. నల్లగొండలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డి కంటే కోమటిరెడ్డి సోదరులు వెయ్యి రెట్లు బలమైన నాయకులని ఆయన పేర్కొన్నారు. సీఎం, హోంమంత్రి స్థాయి నేతలైనప్పుటికీ నల్లగొండ జిల్లా అభివృద్ధికి అన్నదమ్ములు చేసింది శూన్యమని విమర్శించారు.
నల్లగొండ జిల్లాలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని ఆక్షేపించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఫిర్యా దులు వస్తున్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ తప్పు చేస్తే అరెస్ట్ చేయాలే తప్ప రాజకీయ కక్ష సాధింపుతో కాదని హితువు పలికారు. ఆర్ కృష్ణయ్యలాంటి నేత సైతం కేంద్రంలోని బీజేపీకి మద్దతు పలకడం బాధాకరమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ప్రజాశాంతి పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు.
హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చిన ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన అధికారులను ఎం దుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 5 శాతం జనాభా ఉన్న రెడ్డిలు 12 సార్లు ముఖ్యమంత్రి పదవి చేపడితే 60 శాతం ఉన్న బీసీలు ఒక్కసారి కాలేదన్నారు. భవిష్యత్‌లో తెలంగాణలో బీసీల పాలన రావాలని ఆయన ఆక్షాంక్షించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక తాను ముక్కలేనని, కాంగ్రెస్‌కు దమ్ముంటే బీసీ సీఎంను ప్రకటిం చాలని కేఏపాల్ సవాల్ చేశారు.